SC Classification: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఎస్సీ వర్గీకరణ విషయంలో కొత్త ఆలోచన చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై అధ్యయనం కోసం కమిషన్ ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజాన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నియమించింది. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నివేదిక అందిన తరువాత ప్రభుత్వం వర్గీకరణ విషయంలో ఒక నిర్ణయానికి రానుంది. ఎస్సీ వర్గీకరణకు ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. వర్గీకరణ దిశగా నిర్దిష్టమైన సిఫార్సులను సూచించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కమిషన్ కు కావలసిన సహకారం అందించేలా అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చింది.అలాగే వర్గీకరణ పై ఏర్పాటు చేసిన కమిషన్ విధివిధానాలను కూడా ఖరారు చేశారు.రాష్ట్ర, జిల్లా, జోనల్ స్థాయిలో సమకాలీన సమాచారం అందించాల్సి ఉంటుంది.
* జనగణన పరిగణలోకి
ప్రధానంగా వర్గీకరణకు సంబంధించి జనాభా గణనను పరిగణలోకి తీసుకోనున్నారు. ఎస్సీ ఉప కులాలను ఒక హేతుబద్ధమైన ఉప వర్గీకరణ చేయడంపై కూడా సూచనలు తీసుకోవాల్సి ఉంది. షెడ్యూల్డ్ కులాల్లోని ఉప కులాల వెనుకబాటుతనాన్ని గుర్తించేందుకు ఈ ఏకసభ్య కమిషన్ అధ్యయనం చేయనుంది. అదేవిధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని కూడా పరిశీలిస్తుంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణను సమర్థవంతంగా అమలు చేసేలా విధానాన్ని గుర్తించాలని ఏపీ ప్రభుత్వం ఈ కమిటీకి సూచించింది.
* అన్ని ఉప కులాలకు ప్రయోజనాలు
వర్గీకరణ ప్రయోజనాలు అన్ని ఎస్సి ఉప కులాలకు సమానంగా అందేలా చూడాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ కమిషన్ నివేదికకు రెండు నెలల గడువు విధించింది ఏపీ ప్రభుత్వం. మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యయనం చేయడంతో పాటు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వనున్నారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణ తర్వాతే డిఎస్సి ప్రక్రియ ప్రారంభమవుతుందన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే వీలైనంత త్వరగా దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టినట్లు సమాచారం.