Manda Krishna Madiga: సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 30 ఏళ్లుగా మంద కృష్ణమాదిగ చేస్తున్న పోరాటం ఫలించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. పాలకులు కూడా ఎస్సీ వర్గీకరణను స్వాగతించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, నారా చంద్రబాబు నాయకుడు దీనిపై స్పందించారు. దేశంలో ఎస్సీ వర్గీకరణను తెలంగాణలోనే మొదల అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తాను ఎస్సీవర్గీకరణ అవసరాన్ని 20 ఏళ్ల క్రితమే గుర్తించానని తెలిపారు. తన ఆలోచన తప్పు కాదని సుప్రీం కోర్టు తీర్పుతో నిజమైందని తెలిపారు. ఇక అన్నీ రాజకీయ పార్టీలు కూడా సుప్రీం తీర్పును స్వాగతించాయి. అయితే దీని అమలు ఎప్పుడు ప్రారంభిస్తారు.. ఎలా ప్రారంభిస్తారనేది చూడాలి. ఇదిలా ఉండగా.. వర్గీకరణ కోసం 30 ఏళ్లు పోరాడిన మంద కృష్ణమాదిగ కూడా దీనిపై స్పందించారు. ప్రభుత్వరంగా ఉద్యోగాలు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో రిజర్వేషన్ల వర్గీకరణ అంత ఈజీ కాదని సంచలన ప్రకటన చేశారు. వర్గీకరించినా పెద్దగా లాభం ఉండకపోవచ్చని తెలిపారు.
మరో పోరాటం..
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ప్రైవేటురంగం వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈమేరకు చట్టం కూడా చేస్తున్నాయి. ఇటీవల హరియాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రైవేటులోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని చట్టా చేశాయి. దీంతో ఆ రాష్ట్రాలకు పెట్టుబడులు తగ్గిపోయాయి. ప్రైవేటులో రిజర్వేషన్ల అమలును కోర్టులు కూడా తప్పు పట్టాయి. ఇక తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈమేరకు బిల్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నించింది. కానీ చివరి నిమిషంలో ఉప సంహరించుకుంది. ఇలాంటి తరుణంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ప్రైవేటులో రిజర్వేషన్ల అమలుకు మరో పోరాటం చేస్తానని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో రిజర్వేషన్లు అమలయ్యేలా చూస్తానని ప్రకటించారు. అయితే ఇది అందరికీ సమస్యగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాలలు..
ఇదిలా ఉంటే రాజకీయ కోణంలో నుంచి చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనిని అమలుచేశారు. అప్పుడు రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువగా ఉండేది. దీంతో ఎటువంటి ఇబ్బంది ఉండదని భావించారు. కానీ మాలమహానాడు న్యాయపోరాటాలు చేసి నిలిపివేయించింది. తాజాగా సుప్రీంకోర్టు వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మాజీ కాంగ్రెస్ ఎంపీ హర్ష కుమార్ దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు (మాలలకు) ఆమోదయోగ్యం కాదన్నారు. షెడ్యూల్డ్ కులాలకు సంబందించిన ఆర్టికల్ 351 ప్రకారం వర్గీకరణ చేసే హక్కు పార్లమెంటుకి కూడా లేదన్నారు.
ఏపీలో అమలు అంత ఈజీ కాదు..
ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మాలలు, తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉన్నారు. ఈ పరిస్థితిలో వర్గీకరణ అమలు ఏపీలో అంత ఈజీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసినంత ఈజీగా విభజిత ఏపీలో అమలు చేయలేదు. అమలుకు ప్రయత్నిస్తే మాలల నుంచి వ్యతిరేకత తప్పదు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు వర్గీకరణపై వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలా అమలు చేస్తాయన్నది ఇప్పుడే మిలియన్ డాలర్ల ప్రశ్న.