sankranti festival specialty and donations : ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే చక్కటి పండుగు ‘సంక్రాంతి’. ఈ ఫెస్టివల్ కోసం అందరూ తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. మూడు లేదా నాలుగు రోజుల పాటు ఎంచక్కా హాయిగా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు చేసుకుంటుంటారు. కాగా, ఈ రోజు విశిష్టత, ఈ రోజున ప్రతీ ఒక్కరు ఏం చేయాలనే సంగతులు తెలుసుకుందాం.
సంక్రాంతి పర్వదినాన పాతతనానికి వీడ్కోలు పలికి, కొత్తదనానికి స్వాగతం పలకాలని పెద్దలు చెప్తుంటారు. సంక్రాంతి పండుగ వచ్చే నాటి పంటల కోతలు అయిపోయి ధాన్యం ఇంటికి చేరుతుంది. ఈ నేపథ్యంలో పొలాల్లో ఉండే కీటకాలు ఇళ్లలోకి రాకుండా ఉండేందుకుగాను వాకిళ్లలో కల్లాపి చల్లుతారని పెద్దలు వివరిస్తున్నారు. ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను పెట్టి పూజిస్తుంటారు.
సంక్రాంతి పర్వదినానా సూర్యుడి సంక్రమణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున కొందరు పూజలు కూడా చేసుకుంటారు. ఇకపోతే ఈ రోజున దానాలు చేస్తే కనుక పుణ్యం లభిస్తుంది. సామాన్య రోజులలో కంటే ఈ రోజున దాన ధర్మాలు చేస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుందని పెద్దలు పేర్కొంటున్నారు. మన పూర్వీకులతో పాటు, పితృదేవతలకు దానం చేయాలి. అన్నదానం, భూదానం, వెండిదానం, సువర్ణదానం, పుస్తకదానం, పప్పు, ఉప్పు, బియ్యం, గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులను దానం చేస్తే చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి.
ఈ పండుగరోజున ఇళ్లల్లో చక్కగా అలంకరణ చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ పెట్టి, వాకిట్లో ముగ్గులు వేసి..వాటిలో ఆవు పేడ, గొబ్బెమ్మలు పెట్టడంతో పాటు ఇంట్లో పిండివంటలు, పరమాన్నం చేయాలని, ఆ తర్వాత శ్రీమన్నారాయణుడిని ఆరాధించాలని పెద్దలు చెప్తున్నారు. ఇదంతా కూడా శాస్త్రాల్లో ఉందని వివరిస్తున్నారు. పిండి వంటకాలను ఆరగించడంతో పాటు దానం కూడా చేయాలని సూచిస్తున్నారు. ఇకపోతే ఈ పర్వదినాన అందరూ కొత్త బట్టలు ధరించి దేవుడిని మనసులో స్మరణ చేసుకుని తమ పనులు మొదలుపెట్టుకుంటే చాలా మంచిది. ఈ రోజున నూతన వస్తువుల కొనుగోలు చేయడం కూడా మంచిదే.