Makar Sankranti Effect : అంతటా సంక్రాంతి( Pongal) సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు స్వగ్రామాలకు తరలివస్తున్నారు. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది. మరోవైపు ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. బస్సులతో పాటు రైళ్లలో కిక్కిరిసిపోతూ ప్రయాణాలు చేస్తున్నారు. ముందస్తుగా రిజర్వేషన్లు( reservations booking ) చేసుకున్న వారికి పర్వాలేదు. లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే( South Central Railway) సైతం ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రైవేటు బస్సు ఏజెన్సీలు సైతం భారీగా సర్వీసులను నడుపుతున్నాయి. అయినా సరే ప్రయాణికులకు చాలడం లేదు. భారీగా బస్సుల టికెట్ ధరలు పెరగడంతో.. ఎక్కువమంది విమానాలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖకు వెళ్లాల్సినవారు విమానాలను ఆశ్రయిస్తున్నారు.
* చార్జీలు నాలుగింతలు ప్రయాణికుల( passengers ) రద్దీ దృష్ట్యా విమానయాన సంస్థలు కూడా చార్జీలను అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు బెంగళూరు నుంచి విశాఖ వస్తున్న వారికి విమాన టిక్కెట్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. శని ఆదివారాల్లో హైదరాబాద్ నగరం నుంచి విశాఖకు విమాన కనీస చార్జీ 18 వేల రూపాయల పై మాటే. బెంగళూరు నుంచి రావాలంటే 12 వేల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖపట్నం కనీస ధర రూ.3400 నుంచి నాలుగు వేలు ఉండగా.. ఇప్పుడు ఐదింతల వరకు ధర పెరగడం విశేషం. కేవలం సంక్రాంతి దృష్ట్యా.. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని విమానయాన సంస్థలు అమాంతం ధరలు పెంచేశాయి. అయినా సరే సొంత గ్రామాలకు తొందరగా వెళ్లాలి అనుకున్న వారు వేల రూపాయలు చెల్లించి విమాన టిక్కెట్లు పొందుతున్నారు.
* హాట్ కేకుల్లా విమాన టిక్కెట్లు
ప్రధానంగా హైదరాబాదు( Hyderabad) నుంచి విశాఖపట్నం( Visakhapatnam) వచ్చే విమానాల టిక్కెట్లు ఇట్టే బుక్ అవుతున్నాయి. ప్రైవేటు విమానయాన సంస్థలు చార్జీలు పెంచినా.. ఎవరు వెనక్కి తగ్గడం లేదు. బస్సు టికెట్ ధర 5 వేల రూపాయల వరకు వెళ్లడంతో.. ఎక్కువమంది విమాన సర్వీసుల వైపు వస్తున్నారు. గంటల వ్యవధిలో స్వగ్రామాలకు వెళ్లే అవకాశం ఉండడంతో ఎక్కువమంది.. ప్రైవేటు విమానాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సాధారణ రోజుల్లో మామూలుగా కనిపించే ఎయిర్పోర్టులు సైతం సంక్రాంతికి రద్దీగా మారడం విశేషం.
* హైవేలో వాహన రద్దీ
ఇంకోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రధాన జాతీయ రహదారి( National Highway) వేల వాహనాలతో కిటకిటలాడుతోంది. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. టోల్ ప్లాజా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా వాహనాల ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించలేకపోతున్నారు. మరోవైపు పోలీసులకు సైతం ఇది ఇబ్బందికరంగా మారుతోంది. సొంత గ్రామాలకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణ సమయంలో కూడా తమకు ఇబ్బందులు తప్పవని పోలీసులు చెబుతున్నారు.