Sajjala key statement: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన పాలసీ అంటూ లేకుండా పోతోంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో చెబుతారు. దానిని కవర్ చేసేలా మాట్లాడుతారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్తూ ప్రెస్ మీట్ పెడుతుంటారు జగన్మోహన్ రెడ్డి. ఈవారం కూడా పెట్టారు. కానీ అమరావతి ప్రస్తావన తీసుకొచ్చారు. గుంటూరు -విజయవాడ మధ్య పెడితే సరిపోయేది అని.. అనవసరంగా అమరావతిలో కట్టారని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా కృష్ణా నది గర్భంలో కడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. జాతీయ మీడియాలో సైతం తప్పు పడుతూ వార్తలు వస్తున్నాయి.
దిద్దుబాటు చర్యలకు
అయితే ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు గాను సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు మీడియా ముందుకు. జగన్మోహన్ రెడ్డి అలా అనలేదు. అనవసరంగా వక్రీకరించారు అంటూ చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో అదే స్టాండ్ తో ఉన్నారని చెప్పారు. అంటే మూడు రాజధానులు? లేకుంటే నది గర్భంలో నా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డికి వేరే ఉద్దేశం ఉంటే అమరావతిలో ఎందుకు ఇల్లు, కార్యాలయం కడతారు అంటూ పాత పాటనే వినిపించారు. ఒక్క మాట మాత్రం నిజం. అమరావతి విషయంలో ఎలా ముందుకెళ్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదు. అందుకే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది.
గతంలో కూడా ఇదే మాదిరిగా..
గతంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇలానే వ్యవహరించారు. అమరావతిలో అనుకూల జర్నలిస్టుతో మీడియా కంక్లేవ్ నిర్వహించారు. అమరావతి రాజధాని విషయంలో మా స్టాండ్ ఇదేనంటూ చెప్పుకొచ్చారు. అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి పిలిచి క్లాస్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. దాని నుంచి ఇప్పుడు గుణపాఠాలు నేర్చుకున్నట్టు ఉంది. ఇంకా పాత మాదిరిగానే మాట్లాడుతున్నారు. అమరావతి విషయంలో అనవసరంగా జోక్యం చేసుకొని పరువు తీస్తున్నారని వైసీపీలో సీనియర్లు ఆవేదనతో ఉన్నారు. గతంలో తమతో అమరావతికి వ్యతిరేకంగా అనరాని మాటలు అనిపించారని వారు వాపోతున్నారు. ఎంతటి అపజయం ఎదురైన తర్వాత కూడా గుర్తించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తర్వాత సజ్జల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీకి ఇబ్బంది పెడుతున్నాయి అన్నది వారి ఆవేదన.