Rushikonda: విశాఖ రుషికొండ( rushikonda) భవనాలు మరోసారి చర్చకు వచ్చాయి. ఈ భవనాల వినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతోంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి ఏర్పడింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో 500 కోట్ల రూపాయలతో రుషికొండ భవనాలను నిర్మించారు. కానీ ఎందుకు నిర్మించారో అధికారికంగా ప్రకటించలేదు వైసీపీ ప్రభుత్వం. అయితే అది ముఖ్యమంత్రి పరిపాలన కార్యాలయంగా భావించి నిర్మించారని.. అందులో తప్పు ఏముందని అప్పట్లో వైసీపీ నేతలు ప్రశ్నించేవారు. కానీ ఇప్పుడు దానిపై కనీసం కూడా మాట్లాడడం లేదు.
* విశాఖలో ల్యాండ్ మార్క్.. విశాఖలో( Visakhapatnam) రిషికొండ అనేది ఒక ల్యాండ్ మార్క్. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. అక్కడ కొండను గుల్ల చేసి పర్యాటక ఆనవాళ్లను తొలగించారు. భారీ భవంతులను నిర్మించారు. పర్యాటక శాఖ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు పూర్తి చేశారు. కానీ ఫలానా కోసం నిర్మాణాలు అని చెప్పలేకపోయారు. పనులు పూర్తి చేసి ప్రారంభించలేకపోయారు. విశాఖ పాలనా రాజధానిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అది ముఖ్యమంత్రి కార్యాలయం కోసమేనని అప్పట్లో మంత్రులు ఒకరిద్దరు ప్రకటించారు. కానీ అధికారికంగా ప్రకటించేందుకు అప్పటి వైసిపి ప్రభుత్వం ముందుకు రాలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే మాత్రం ఆ భవనాల నుంచి ముఖ్యమంత్రి తప్పకుండా ప్రారంభించి ఉండేది అన్నది బహిరంగ రహస్యం.
* ప్రజాభిప్రాయ సేకరణకు ప్రకటనలు
అయితే కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతోంది. కానీ రుషికొండ భవనాల వినియోగం విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. మొన్న ఆ మధ్యన సినిమాల చిత్రీకరణతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించి ఉపయోగించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగింది. పర్యాటక రంగంలో పేరు మోసిన సంస్థలకు అద్దెకు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. ఆపై పర్యాటక అతిథి గృహాలుగా, భారీ ఎగ్జిబిషన్ల నిర్వహణకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు.
తాజాగా ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రుషికొండ భవనాలపై మరోసారి చర్చ జరిగింది. భవనాల నిర్వహణ, విద్యుత్ చార్జీలకు నెలకు 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని.. గతంలో రుషికొండ పర్యాటక ప్రాంతం ద్వారా నెలకు కోటి రూపాయలు ఆదాయం సమకూరేదని మంత్రులు ప్రస్తావించారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు ప్రజాభిప్రాయం కోసం ప్రకటనలు ఇవ్వాలని.. ప్రజలు కోరుకున్న విధంగానే రుషికొండ భవనాలను వినియోగించుకుందామని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే రుషికొండ భవనాల విషయం అటు తిరిగి ఇటు తిరిగి ప్రజల చేతుల్లోకి వెళ్లడం విశేషం.