Nandyal: ‘ఆకర్షణీయమైన జీతం.. మంచి ఉద్యోగం.. ఇంటి నుంచి హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు.. నెలకు 40,000 నుంచి 50 వేల వరకు సులువుగా సంపాదించవచ్చు. అయితే చిన్న షరతు. రెండున్నర లక్షల రూపాయలు ఇస్తే ఎంచక్కా జీవితాంతం ఉద్యోగం చేసుకోవచ్చు’ అని చెప్పడంతో నిరుద్యోగులు వెనుకా ముందు ఆలోచించకుండా డబ్బులు కట్టేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందలాదిమంది బాధితులుగా మారారు. 120 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన ఆ ప్రబుద్ధులు పరారీలో ఉన్నారు. అయితే వారికి అధికార పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నంద్యాలలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇలా మోసం చేస్తున్నవారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రాపకం పొందడంలో సిద్ధహస్తులని తెలుస్తోంది.
* మాయ మాటలు చెప్పి..
కొందరు ఆన్లైన్, ఫేస్బుక్, వాట్సాప్ తదితర రూపాల్లో సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని.. సన్నిహిత్యం పెంచుకుంటున్నారు. మాయమాటలు చెప్పి ముగ్గులోకి దించుతున్నారు. విద్యార్హతకు తగ్గ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మ బలుకుతున్నారు. కనీసం పరిచయం లేని కొందరు నిరుద్యోగులు లక్షలు చెల్లించి మోసపోతున్నారు. అయితే తమ బంధువులు రాజకీయ నేతలని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అయితే ఇందులో కొందరు అధికార పార్టీ నేతల బంధువులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై అధికార పార్టీ దృష్టి పెట్టకపోతే ఇబ్బందికరమే.
* దొర్నిపాడు కేంద్రంగా..
నంద్యాల జిల్లా దొర్నిపాడు కేంద్రంగా ఉద్యోగాల పేరిట భారీ గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది. వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ పేరిట.. వర్క్ ఫ్రం హోం పేరుతో అమాయకులను వలవేసినట్లు ప్రచారం సాగుతోంది. సుమారు 5000 మంది నుంచి 120 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇది పక్కా వ్యూహంతో చేసినట్లు సమాచారం. ఈ ఉద్యోగానికి ఎటువంటి అర్హతలు లేవని.. కేవలం సెల్ఫోన్.. బ్యాంక్ అకౌంట్ చాలని.. కంపెనీ నుంచి వచ్చిన సమాచారాన్ని ఇతరులకు పంపించడం వంటి పనులే ఉంటాయని నమ్మించారు. ముందుగా రెండు లక్షల 50 వేల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని.. అలా చేస్తే నెలకు 40,000 నుంచి 50 వేల రూపాయల వరకు జీతం వస్తుందని నమ్మించారు. తొలుత తమ బంధువులను ఉద్యోగులుగా చేర్పించి వారి ఖాతాల్లో జీతాలు వేశారు. వారి ద్వారా మిగతావారు పెద్ద ఎత్తున డబ్బు కట్టేలా ప్రచారం చేశారు. అలా వ్యాపారం విస్తరించింది. 5000 మంది డబ్బులు కట్టి నిలువునా మోసపోయారు. రాత్రికి రాత్రే నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. అయితే ఒక బ్యాంక్ ఖాతా నుంచి రోజుకు కోట్ల రూపాయలు లావాదేవీలు జరగడంతో కేంద్ర ఇంటెలిజెన్స్ సైతం అప్రమత్తం అయింది. నంద్యాల జిల్లా పోలీస్ యంత్రాంగానికి స్పష్టమైన సమాచారం వచ్చింది. ఇంతలోనే ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. కానీ ఈ భారీ గోల్మాల్ వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.