RTV Ravi Prakash : ఎన్నికలకు ముందు ఫలితాలను అంచనా వేయడాన్ని ఒపీనియన్ పోల్స్ అంటారు. ఎన్నికల తర్వాత ఓటర్ల మనో గతాన్ని తెలుసుకొని వెల్లడించే వాటిని ఎగ్జిట్ పోల్స్ అంటారు. దేశంలో పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో.. శనివారం సాయంత్రం ఆరు గంటల 30 నిమిషాల నుంచి సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించాయి. ఈసారి కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి. చివరికి ఇండియా టుడే కూడా ఎన్డీఏ వైపు మొగ్గు చూపింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే చాలావరకు సంస్థలు కూటమి అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి.. ఎగ్జిట్ పోల్స్ కు ఉన్న పారదర్శకత ఎంత? గతంలో వెల్లడించిన వివరాలు ఎంతవరకు నిజమయ్యాయి? అనే విషయాలను పక్కన పెడితే.. ఈ ఎగ్జిట్ పోల్స్ ను ఆధారంగా చేసుకుని చాలా వరకు రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి..
ఇక తెలుగు నాట ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత.. రాజకీయ పార్టీలు రకరకాల ప్రకటనలు చేశాయి. రాజకీయ పార్టీల లాగే సర్వే సంస్థలు కూడా విడిపోవడంతో.. ఇందులో దేనికి ఎంత పారదర్శకత ఉంటుందనేది ఒకింత అనుమానంగానే ఉంది.. ఇక టీవీ9 నుంచి బయటికి వెళ్లిపోయిన తర్వాత రవి ప్రకాష్ ఆర్ టి వి పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఇక ఇటీవల ఎన్నికల సమయం నుంచి మరోసారి యాక్టివ్ అయ్యాడు.. తన ఆర్ టీవీ ద్వారా ఎన్నికలకు ముందు ఒపీనియన్ పోల్స్ లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పాడు. అప్పుడు దీనిని వైసీపీ ఖండించింది. రవి ప్రకాష్ అమ్ముడు పోయాడని ఆరోపించింది. ఇలాంటి ఒపీనియన్ పోల్స్ ప్రజల మూడ్ మార్చలేవని ప్రకటించింది.. ఆయినప్పటికీ 20 ప్రకాష్ తన విధానాన్ని మార్చుకోలేదు. పైగా వైసిపి మరింత కుళ్లుకునే విధంగా రిపోర్టుల పేరుతో వార్తా కథనాలను ప్రసారం చేశాడు. యాదృచ్ఛికంగా తనకు అనుకూల మీడియా ఉన్నప్పటికీ టిడిపి రవి ప్రకాష్ ప్రసారం చేసిన కథనాలను.. విస్తృతంగా పబ్లిసిటీ చేసుకుంది..
ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశ వ్యాప్తంగా పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో మెజారిటీ సంస్థలు ఏపీలో కూటమికి అధికారం వస్తుందని ప్రకటించాయి. ఈ క్రమంలో శనివారం, ఆదివారం ఆ హడావుడి ముగిసిన తర్వాత.. రవి ప్రకాష్ ఒక్కసారిగా మేల్కొన్నాడు. తన ఆర్టీవీ చానల్లో సోమవారం టిడిపి కూటమికే అధికారమని స్పష్టం. దీనికి రకరకాల పేర్లు పెట్టి.. గ్రౌండ్ రియాల్టీ అంటూ చెప్పి.. ఏకంగా 150 సీట్లు గెలుచుకుంటుందని స్పష్టం చేశాడు. వాస్తవానికి చాలావరకు ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని వెల్లడించాయి. పాత సీసాలో కొత్త మందు సామెత మాదిరి.. ఆ ఎగ్జిట్ పోల్స్ ను కాస్త అటు ఇటు తిప్పి.. కొత్త విషయం చెబుతున్నట్టు కలరింగ్ ఇచ్చాడు.. ఎన్నికలకు ముందు.. అది కూడా ఫలితాలకు ఒక రోజు ముందు ఉండే ఆ హైప్ ను అనుకూలంగా మలుచుకునేందుకు రవి ప్రకాష్ ఈ ఎత్తుగడకు పాల్పడ్డాడని జర్నలిజం సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఒపీనియన్ పోల్లో ఇదే విషయాన్ని రవి ప్రకాష్ వెల్లడించాడు. అప్పట్లో కూటమికి 130 సీట్లు వస్తాయని చెప్పిన అతడు.. సోమవారం వెల్లడించిన ఫలితాలలో ఏకంగా 150 సీట్లు వస్తాయని స్పష్టం చేశాడు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని చెప్పేశాడు.
అయితే రవి ప్రకాష్ చెప్పినట్టు కూటమి ఆ స్థాయిలో సీట్లు గెలుచుకుంటుందా? జగన్ పార్టీ మరీ అంత దారుణంగా ఓడిపోతుందా? మహిళలు కూడా జగన్ వైపు లేరా? అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందా? ఏపీ ప్రజలు పంచుడు పథకాల కంటే అభివృద్ధినే బలంగా కోరుకున్నారా? అనే ప్రశ్నలకు రేపు ఉదయం లోగా సమాధానం లభిస్తుంది. అప్పటిదాకా రవి ప్రకాష్ లాంటి వ్యక్తుల విశ్లేషణలు సాగుతూనే ఉంటాయి. ఒకప్పుడు ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకునేవారు. ఇప్పుడు పల్లి బఠాణి కింద జమేస్తున్నారు.