Minister Nara Lokesh: మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh) చాలా పరిణితి సాధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీపై పూర్తి పట్టు సాధించారు. పాలనలోను తనదైన ముద్ర వేసుకుంటున్నారు. అయితే ఇది మామూలుగా రాలేదు లోకేష్ కు. చాలా రకాల ఇబ్బందులు అధిగమించారు. ఎన్నెన్నో అవమానాలను తట్టుకొని నిలబడగలిగారు. అసలు నమ్మకమే లేని లోకేష్ ఇలా మారేసరికి సొంత పార్టీ వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. అటు కేంద్ర పెద్దలతో సైతం మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. గత కొద్ది కాలంగా వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే బిజెపి పెద్దలు సైతం.. చంద్రబాబు వారసుడిగా లోకేష్ కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తుండటం విశేషం. తాజాగా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు లోకేష్ తో సమావేశం కావడం కూడా మారిన వైఖరికి ఒక కారణం. లోకేష్ అంటేనే ఒక రకమైన ముద్ర ఉండేది. దానిని దాటుకొని ఈరోజు పరిణితి సాధించిన నేతగా జాతీయస్థాయిలోనే గుర్తింపు పొందారు లోకేష్. నిజంగా తండ్రిగా చంద్రబాబు కు ఇది గొప్ప అనుభూతి కూడా.
* సొంత పార్టీ శ్రేణులకే నమ్మకం లే..
లోకేష్ పొలిటికల్ ఎంట్రీ సమయంలో ఆయన పై సొంత పార్టీ శ్రేణులు కూడా నమ్మకం లేకుండా పోయాయి. నేరుగా ఎమ్మెల్సీగా.. ఆపై మంత్రిగా తెరపైకి వచ్చారు లోకేష్. అయితే లోకేష్ పనితీరు పట్ల అనేక రకాల అభ్యంతరాలు ఉండేవి. ఒకానొక దశలో టిడిపిని ముందుకు తీసుకెళ్లగలడా అనే అనుమానం కూడా ఉండేది. అయితే కాలం అన్నిటికీ సమాధానం చెప్పినట్టు.. లోకేష్ నాయకత్వం పెరుగుతూ వచ్చింది. ఒక సమర్థవంతమైన నాయకుడిగా తనను తాను తీర్చుకుని నిలబడగలిగారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో సైతం లోకేష్ కు ఒక గుర్తింపు రావడంతో.. బిజెపిని నడిపించే ఆర్ఎస్ఎస్ లాంటి ప్రతినిధులు సైతం ఇప్పుడు ఆయనను కలుస్తున్నారు. ఇది గొప్ప మార్పునకు నాంది అని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది.
* క్రమేపి పట్టు పెంచుకుంటూ..
లోకేష్ ముందుగా తెలుగుదేశం పార్టీపై పట్టు పెంచుకున్నారు. తనను తాను నాయకుడిగా ఆవిష్కరించుకున్నారు. చంద్రబాబు ముద్రను దాటుకొని తనను తాను నిరూపించుకున్నారు. పాలనలోనూ తనదైన ముద్ర చాటుకుంటున్నారు. కేవలం ప్రచారాన్ని మాత్రమే నమ్ముకోలేదు. తన పనితీరుతో ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు. తండ్రి మాదిరిగా జాతీయస్థాయి రాజకీయాల్లో ఒక గుర్తింపు దక్కించుకున్నారు. లోకేష్ ఎదిగిన తీరు మాత్రం యువ నేతలకు ఒక గుణపాఠం. బహుశా భారతదేశ చరిత్రలోనే లోకేష్ పై జరిగిన వ్యతిరేక ప్రచారం ఏ వారసత్వ నేతపై లేదు. కనీసం కనికరం చూపలేదు ఆయనపై. ఆయన పాదయాత్ర చేస్తుంటే ఎదురుగా వచ్చి తిట్ల దండకం అందుకున్న వారు ఉన్నారు. అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారు ఉన్నారు. అయినా సరే వాటన్నింటినీ తట్టుకొని పాదయాత్రను పూర్తి చేయగలిగారు. ప్రతిక్షణం సంయమనంతో ముందుకెళ్తూ అధికారాన్ని అందుకోగలిగారు. ఇప్పుడు తనదైన పాత్ర పోషిస్తూ ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతున్నారు. తన చేతికి మట్టి అంటకుండా రాజకీయాలు చేస్తున్న ఘనత లోకేష్ దే. ముమ్మాటికి ఇది లోకేష్ కు అభినందించాల్సిన విషయం.