Former Minister Roja : మాజీ మంత్రి రోజా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారా? రాజకీయాలు విడిచిపెడతారా? వైసీపీకి గుడ్ బై చెబుతారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. గత కొంతకాలంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు రోజా. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా వ్యవహరించారు. అయితే టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారు. ఆయన హఠాత్ మరణంతో కుమారుడు జగన్ వెంట అడుగులు వేశారు. వైసీపీలో చేరారు. 2014లో తొలిసారిగా నగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా సరే నటన మాత్రం ఆపలేదు. బుల్లితెరతో పాటు వెండితెరపై అప్పుడప్పుడు కనిపించేవారు. అయితే 2019లో వైసీపీ గెలిచింది. పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కింది. అప్పటినుంచి సినిమాలతో పాటు బుల్లితెరకు గుడ్ బై చెప్పారు రోజా. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఆమె సైతం ఘోరంగా ఓడిపోయారు. అయినా సరే పార్టీ అధికార ప్రతినిధిగా రోజా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి తరుణంలో తానుసినిమాల్లో నటిస్తానని చెప్పుకొచ్చారు రోజా. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
* అగ్ర కథానాయకులతో నటన
రోజా ఒకప్పుడు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలను ఊపేశారు. తెలుగులో అగ్ర కథానాయకులతో కలిసి నటించారు. తిరుగులేని స్టార్ హీరోయిన్ గా వెలిగారు. సినిమాల్లో ఉంటూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలో చేరాక ఆమెకు కలిసి వచ్చింది. ఎమ్మెల్యే తో పాటు మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు ఓడిపోవడంతో కాళీ అయ్యారు రోజా. మళ్లీ సినిమాలపై ఫోకస్ పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. హుందాగా ఉండే పాత్రల్లో మాత్రమే తాను నటిస్తానని తేల్చి చెప్పారు రోజా.
* 1991లో పరిశ్రమలోకి
1991లో హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు రోజా. తొలి సినిమా ప్రేమ తపస్సు. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు రోజా. అదే సమయంలో తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా తన సత్తా చాటుకున్నారు. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. తమిళ దర్శకుడు సెల్వామణి ని ప్రేమ వివాహం చేసుకున్నారు. క్రమేపి రాజకీయాల్లోకి వెళ్లిపోయిన రోజా సినిమాలను తగ్గించారు. కానీ ఈటీవీలో వచ్చిన జబర్దస్త్ లో జడ్జిగా సుదీర్ఘకాలం కొనసాగారు. ఆ షో రోజాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆమె మంత్రి అయ్యేవరకు జడ్జిగా కొనసాగారు. కానీ ఎన్నికల్లో ఓటమితో మరోసారి జడ్జిగా వస్తారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది.
* హుందా పాత్రలకు ఓకే
మాజీ మంత్రి రోజా వైఖరి పై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఆమె దూకుడుగా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఈ ఎన్నికల్లో ఓటమికి ఆమె వైఖరి ఒక కారణమన్న విశ్లేషణ ఉంది. తాజాగా ఆమె నోటి నుంచి హుందాతనం అనే మాట వచ్చింది. బాహుబలి లో రమ్యకృష్ణలా, సరిలేరు నీకెవ్వరులో విజయశాంతిలా, అత్తారింటికి దారేదిలో నదియాలా మంచి పాత్రలు చేయాలని ఉందని రోజా వెల్లడించారు. అలాంటి బలమైన పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మొత్తానికైతే అటు రాజకీయాలు కొనసాగిస్తూనే ఇటు నటనపై దృష్టి పెట్టనున్నారు రోజా. మరి ఎటువంటి అవకాశాలు వస్తాయో చూడాలి.