Roja: మాజీ మంత్రి రోజా( RK Roja ) మళ్లీ మెరిశారు. తిరుపతిలో గోశాలలో ఆవుల మరణం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రోజా ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఉన్నపలంగా ఆమె యాక్టివ్ కావడం పై రకరకాల చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల కిందట ఓ మంత్రి ద్వారా ప్రభుత్వంతో రాజీకి వచ్చారని ప్రచారం జరిగింది. ఆమెపై ఎటువంటి కేసులు లేకుండా చూస్తామని ప్రభుత్వం నుంచి భరోసా ఇచ్చినట్లు టాక్ నడిచింది. అందుకు తగ్గట్టుగానే రోజా సైతం సైలెంట్ గా ఉన్నారు. అయితే ఆమె తిరుపతిలో జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో ఒక్కసారిగా మెరిశారు. ప్రభుత్వానికి సవాల్ చేసినంత పని చేశారు.
Also Read: ఏపీలో ఎస్సీ వర్గీకరణకు సై.. మూడు గ్రూపులుగా 59 కులాలు!
* అవినీతి ఆరోపణలు..
గత ప్రభుత్వంలో దూకుడుగా ఉన్న వైసీపీ( YSR Congress ) నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అరెస్టుల పర్వం కూడా కొనసాగింది. ఈ తరుణంలో మాజీ మంత్రి రోజా వ్యవహార శైలి కూడా చర్చకు వచ్చింది. వైసిపి హయాంలో ఆమె నిర్వర్తించిన క్రీడల శాఖలో భారీ అవినీతి జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. సరిగ్గా ఎన్నికలకు ముందు.. ఆడుదాం ఆంధ్ర పేరిట భారీ స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దాంట్లో 119 కోట్ల రూపాయలు అడ్డగోలుగా ఖర్చు పెట్టారని.. భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అంతర్గతంగా విచారణ కొనసాగుతోంది. అప్పటి క్రీడల శాఖ మంత్రిగా రోజాను సైతం విచారిస్తారని.. అవసరం అనుకుంటే అరెస్టు చేస్తారని కూడా ప్రచారం జరిగింది.
* కొద్దిరోజుల పాటు సైలెంట్
ఎన్నికల ఫలితాలు( election results ) వచ్చిన తర్వాత కొద్ది రోజులపాటు రోజా సైలెంట్ అయ్యారు. ఇతర రాష్ట్రాలకు పరిమితం అయ్యారు. కనీసం నగిరి నియోజకవర్గ ముఖం కూడా చూడలేదు. దీంతో రోజా రాజకీయాల నుంచి తప్పుకుంటారని కూడా ప్రచారం జరిగింది. అప్పుడప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో జరిగే సమావేశాలకు మాత్రమే ఆమె వచ్చేవారు. కూటమి ప్రభుత్వం నుంచి కేసులకు భయపడి ఆమె అలా వ్యవహరించారన్న టాక్ నడిచేది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆమెను అధికార ప్రతినిధిగా నియమించింది. అప్పటి నుంచి తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యారు రోజా. అయితే మొన్న ఆ మధ్య విజయవాడలో రాయలసీమకు చెందిన ఓ మంత్రిని రోజా కలిశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అక్కడకు కొద్ది రోజులు గడవక ముందే ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు రోజా.
* రజనీపై వరుస కేసులు
ఇప్పటికే వైసీపీలో మంత్రిగా పనిచేసిన విడదల రజినిపై( vedala Rajini ) వరుస కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మహిళా ప్రజాప్రతినిధుల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అనవసరంగా మహిళా నేతల జోలికి వెళ్తే ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వస్తాయని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అది ఇప్పుడు ఆ మహిళ నేతలకు అస్త్రంగా మారినట్లు తెలుస్తోంది. అందుకే రోజా ప్రభుత్వానికి సవాల్ మీద సవాల్ విసురుతున్నారు. అయితే ఇప్పుడు కూటమి నేతలు రోజా పై ఆగ్రహంగా ఉన్నారు. తప్పకుండా ఆమె అవినీతిని బయటకు తీస్తారని.. తప్పకుండా అరెస్టు చేస్తారని కూటమి శ్రేణులు భావిస్తున్నాయి. రోజాను అస్సలు క్షమించవద్దని సోషల్ మీడియా ద్వారా కూటమి శ్రేణులు కోరుతుండడం విశేషం.
Also Read: ఏపీలో ఎస్సీ వర్గీకరణ.. ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ.. 59 ఉప కులాలు టర్న్!