Srikakulam : శ్రీకాకుళం రాజకీయాలు మరీ విచిత్రంగా ఉంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఓ సామాజికవర్గం ఆధిపత్యం కొనసాగుతుంది. అందునా రెండు కుటుంబాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఇరు కుటుంబాల మధ్య పరస్పర సహకారంతోనే అది సాధ్యమవుతుందన్నది సిక్కోలు ప్రజలకు తెలుసు. అలాగని ఆ కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నాయంటే పొరబడినట్టే. బద్ధ శత్రువులుగా ఉండే పార్టీల్లో కొనసాగుతూ ‘స్నేహం’ కొనసాగించగల నేర్పరితనం వారి సొంతం. అవే కింజరాపు, ధర్మాన కుటుంబాలు. రాజకీయ మంటల్లో చలి కాచుకోవడం ఇరు కుటుంబాలకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. పరస్పరంగా కలబడరు. ఎదురొడ్డి నిలబడరు. అంతా తెర వెనుక మంత్రాంగంతో ఇచ్చుపుచ్చుకునే ధోరణితో సాగుతుంటారు.
జిల్లాలో కళింగ, తూర్పుకాపు సామాజికవర్గం అధికం. ఆ తరువాత స్థానంలో వెలమలు ఉంటారు. కానీ కళింగ, తూర్పుకాపులకు తోసిరాజని వెలమ సామాజికవర్గానికి చెందిన కింజరాపు, ధర్మాన కుటుంబాలు దూసుకుపోతున్నాయి. మిగతా రెండు సామాజికవర్గాలను అచేతనం చేసి రెండు కుటుంబాలు రాజ్యమేలుతున్నాయి. టీడీపీ వస్తే కింజరాపు, వైసీపీ వస్తే ధర్మాన అన్నట్టుంది జిల్లాలో వ్యవహారం. ఇరు కుటుంబాలకు జిల్లా వ్యాప్తంగా బలమైన నెట్ వర్క్ ఉంది. కింది స్థాయిలో సైతం కేడర్ ను పటిష్టం చేసుకున్నారు. అందుకే సుదీర్ఘ కాలం తమ మార్కు రాజకీయాన్ని నడుపుతున్నారు.
ఎదురెదురు పార్టీల్లో ఉన్నా.. రాజకీయ వైరం కొనసాగుతున్నా.. వారి మధ్య ముఖాముఖి పోరు ఎప్పడూ లేదు. ఇరు కుటుంబాల నుంచి ఇద్దరేసి ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగుతుంటారు. ఇలా నలుగురు వేర్వేరు నియోజకవర్గంలో పోటీచేస్తారు. అక్కడ పరస్పర సహకారం అందించుకొని నలుగురూ చట్టసభల్లోకి వెళతారు. గెలిచిన పార్టీ నుంచి ఒకరికి మంత్రి పదవి తప్పనిసరి. పార్టీ ఓడినా ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచి లైమ్ లైట్ లో ఉంటారు. రెండున్నర దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న రాజకీయం ఇదే.
గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలకుగాను రెండుచోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది. టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, ఇచ్ఛాపురం నుంచి బెందాళం అశోక్ బాబు గెలుపొందారు. శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. అయితే శ్రీకాకుళం లోక్ సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లకుగాను.. ఐదింట టీడీపీ ఓడిపోయింది. వైసీపీ గెలిచిన శ్రీకాకుళం, నరసన్నపేట నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థి అత్యధిక ఓట్లు సాధించడం విశేషం. అక్కడ టీడీపీ అభ్యర్థులకు మించి ఎంపీ అభ్యర్థికి ఓట్లు పోలయ్యాయి. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలుగా ధర్మాన సోదరులు ఎన్నిక కావడం.. ఆ నియోజకవర్గంలో కింజరాపు వారసుడుకి అత్యధిక ఓట్లు రావడం వెనుక మతలబు ఏమిటి? అంతే పరస్పర సహకారం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇటీవల మాజీ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ఒక స్టెట్మెంట్ ఇచ్చారు. అచ్చెన్నాయుడికి దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని సవాల్ చేశారు. దీంతో ఈ ఇరు కుటుంబాల రాజకీయాలు చేసుకున్న వారు తెగ నవ్వుకున్నారు. గతం నుంచి జరుగుతున్న పరస్పర సహకారాన్ని గుర్తు చేసుకున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Rivals in front of screen friends behind two families ruling politics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com