AP Ministers: రాష్ట్రవ్యాప్తంగా మరోసారి మంత్రివర్గ విస్తరణ తెరపైకి వచ్చింది. త్వరలో రెండేళ్ల పాలన పూర్తవుతున్న తరుణంలో చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేపడతారని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం మూడేళ్ల వరకు ఎటువంటి మార్పు ఉండబోదని చెబుతున్నారు. అయితే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు చేసిన ట్వీట్ కు ఏడాది పూర్తయింది. కానీ ఇంతవరకు ఆయనకు మంత్రిగా ఛాన్స్ ఇవ్వలేదు. మార్చిలో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. అదిగో ఇదిగో అంటూ వస్తున్న విస్తరణ మాత్రం కనిపించడం లేదు. అయితే తాజాగా విస్తరణ ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి. కానీ అందులో ఎంత నిజం ఉందో కానీ తెలియదు. కానీ ఆశావహులు మాత్రం ఆశల పల్లకిలో ఉన్నారు. ఈసారి తమకు మంత్రి పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు. ఇటువంటి వారి జాబితా రాష్ట్రవ్యాప్తంగా చాలానే ఉంది. ముఖ్యంగా సీనియర్లు పదవిని ఎక్కువగా ఆశిస్తున్నారు. ఇదే తమకు చిట్ట చివరి అవకాశం అని భావిస్తున్నారు.
సీనియర్ల ఎదురుచూపు..
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లా నుంచి సీనియర్లు మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, పితాని సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పరిటాల సునీత.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సీనియర్లు మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. అయితే అనవసరంగా తేనె తుట్టను కదుల్చుతారా? అన్నది అనుమానమే. ఎందుకంటే రకరకాల సమీకరణలను పరిగణలోకి తీసుకుని మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది.
పదిమంది కొత్త వారే
చంద్రబాబు తన మంత్రివర్గంలో ఈసారి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. దాదాపు పదిమంది మంత్రులు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారే. కేవలం లోకేష్ కోసమే జూనియర్లను ఎంచుకున్నారని ఒక కామెంట్ ఉంది. అయితే జనసేనతో పాటు బిజెపికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా కొంతమంది సీనియర్లకు అవకాశం కల్పించ లేకుండా పోయారు. అయితే మంత్రి పదవులపై ఎక్కడ అసంతృప్తి మాత్రం వినిపించడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అవకాశం ఇవ్వదలుచుకోలేదు టిడిపి కూటమి నేతలు. అందుకే మరి కొంతకాలం వెయిట్ చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నారు సీనియర్లు. అయితే ఒకరిద్దరు మంత్రులు తప్ప అందరూ గాడిలో పడ్డారు. ఇటువంటి సమయంలో అనవసరంగా చంద్రబాబు మంత్రి వర్గాన్ని కదిలిస్తారా అన్నది అనుమానమే.
ఎన్నికలకు ఏడాది ముందు..
2029 కి ఏడాది ముందు విస్తరణ జరుపుతారు అనేది ఒక అంచనాగా ఉంది. అప్పుడు సీనియర్లను తీసుకుని జూనియర్లను పార్టీ సేవలకు వినియోగించుకునే అవకాశం ఉంది. అప్పుడే 2029 ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారంలోకి రావాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట. అయితే ఈ మొత్తం పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీ తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడున్న మంత్రుల్లో పది నుంచి 15 మంది మార్పు ఖాయమట. వారి స్థానంలో సీనియర్లకు మంత్రివర్గంలోకి తీసుకుని జూనియర్ల సేవలను ఎన్నికల్లో వినియోగించుకుంటారని సమాచారం. అయితే అటువంటి ఆలోచన లేదని మరో ప్రచారం ఉంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలతతో పాటు సంతృప్తి ఉంది. ఇటువంటి సమయంలో చేతులు కాల్చుకోవడం తగదని ఎక్కువ మంది సూచిస్తున్నారట. మొత్తానికైతే ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఏదో జరుగుతోంది. కానీ ఇప్పుడిప్పుడే మంత్రివర్గ విస్తరణ ఉండదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.