Reddappa Family: కడప.. ఈ మాట చెబితేనే గతంలో రాజశేఖర్ రెడ్డి కుటుంబ హవా వినిపించేది. స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు సీన్ మారింది. 2024 ఎన్నికలతో రాజకీయం ముఖ చిత్రం మారింది. కడప అంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబమే కాదు.. తాము కూడా అన్నట్టు కొన్ని కుటుంబాలు తెరపైకి వచ్చాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి గట్టి సవాళ్లు విసురుతున్నాయి. అటువంటి కుటుంబంలో రెడ్డప్ప గారి కుటుంబం ఒకటి. ఐదేళ్ల వైసిపి పాలనలో కడపలో ఎదురెళ్లి పోరాడింది రెడ్డప్ప గారి రెడ్డి కుటుంబం. అయితే ఇప్పుడు అదే కుటుంబానికి గండిపడే ఒక నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ హై కమాండ్. టిడిపి అధ్యక్షుడిగా ఉన్న రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి స్థానంలో యువనేత భూపేష్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. దీంతో రెడ్డప్ప గారి కుటుంబ వ్యతిరేకులు సంబరాలు చేసుకుంటున్నారు.
అత్యంత సంక్లిష్ట సమయంలో..
2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కడప జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. కనీసం ఉనికి చాటుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయింది. అటువంటి సమయంలో టిడిపి జిల్లా పగ్గాలు తీసుకునేందుకు సీనియర్లు ముందుకు రాలేదు. ఆ పరిస్థితుల్లో ముందుకు వచ్చారు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి. స్థానిక సంస్థల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడిచే రోజులు అవి. కానీ రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి ఎదురెళ్ళారు. ఆయన భార్య మాధవి రెడ్డి దూకుడు ప్రదర్శించారు. ఒక్క కడప జిల్లా కేంద్రం కాదు.. జిల్లా మొత్తం ప్రభావం చూపారు. కూటమి పార్టీల నేతల సహకారం తోడు కావడంతో కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వగలిగారు.
ప్రతికూల ప్రభావం..
అయితే సాధారణంగా రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తే దాని ప్రభావం చాలా రకాలుగా ఉంటుంది. ఆ ప్రభావం పడింది రెడ్డప్ప గారి దంపతులపై. సొంత పార్టీతో పాటు కూటమి పార్టీల్లో కూడా వారికి వ్యతిరేకులు తయారయ్యారు. రెడ్డప్ప గారి కుటుంబ హవాను ప్రశ్నించారు. మొన్నటికి మొన్న కడపలో మహానాడు సక్సెస్ఫుల్గా నిర్వహించగలిగారు రెడ్డప్ప గారి దంపతులు. ఆ సమయంలో చంద్రబాబు అభినందించేసరికి భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అయ్యారు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి. తద్వారా జిల్లాల్లో పార్టీ పటిష్టానికి తాము ఎంత కృషి చేశామో తన కన్నీటి ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే పొలిట్ బ్యూరో సభ్యుడిగా పదోన్నతి పొందిన రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డిని టిడిపి జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగిస్తారని చూశారు. కానీ ఆ సీట్లోకి వచ్చేసారు జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి. దీంతో ఇంటా బయట ఉన్న రెడ్డప్ప గారి ప్రత్యర్ధులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు.