Palasa: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు ఓ 6 జిల్లాలు అదనంగా ఏర్పాటు అవుతాయని వార్తలు వచ్చాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడు జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించడం విశేషం. మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుకు మాత్రమే ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు పై ఆశలు పెట్టుకున్న చాలా ప్రాంతాల ప్రజలకు నిరాశ తప్పలేదు. ముఖ్యంగా పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు అవుతుందని శివారు ప్రాంత ప్రజలు ఆశించారు. అయితే కేవలం రెండు నియోజకవర్గాలతో పలాస జిల్లా ఏర్పాటు అనేది భావ్యం కాదని మంత్రుల కమిటీ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పలాస జిల్లాగా ప్రకటించలేదని సమాచారం.
‘పలాస’ ప్రత్యేక జిల్లా.
* ఆ నాలుగు నియోజకవర్గాలతో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో జిల్లాల విభజన జరిగింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. అయితే ఓ నాలుగు నియోజకవర్గాలతో పలాస జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అప్పుడే వచ్చింది. అయితే పలాస జిల్లాలో కలిసేందుకు పలాస తో పాటు ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజలు ఆసక్తిగా ఉండేవారు. అయితే పక్కనే ఉన్న టెక్కలితో పాటు పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు మాత్రం పెద్దగా అంగీకారం తెలపలేదు. ఈ కారణంగానే అప్పట్లో పలాస జిల్లా కేంద్రంగా ప్రకటన చేయలేదు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ప్రజలకు పాలనాపరమైన సౌకర్యం మెరుగుపరిచేందుకుగాను టెక్కలి డివిజన్ నుంచి వేరుచేసి పలాస రెవెన్యూ డివిజన్ ప్రకటన చేశారు. పలాసతోపాటు ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలను పలాస రెవెన్యూ డివిజన్లో చేర్చారు.
* ఆ విమర్శలతో..
వైసిపి హయాంలో జిల్లాల ఏర్పాటు విషయంలో హేతుబద్ధత పాటించలేదన్న విమర్శ ఉంది. దానిని సరి చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ మంత్రుల కమిటీ ప్రజల నుంచి వినతులు స్వీకరించింది. అయితే ఈసారి కూడా పలాస ప్రత్యేక జిల్లాకు మోక్షం కలగలేదు. దానికి కారణం పలాసలో కలిసేందుకు పాతపట్నం ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. భౌగోళికంగా పలాస కు చాలా దూరంగా ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పోలిస్తే పలాస జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే వ్యయ ప్రయాసలకు గురికావాల్సి ఉంటుంది. అందుకే వారి నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది.
* టెక్కలిలో సైతం విముఖత..
మరోవైపు టెక్కలి( Tekkali) నియోజకవర్గం ప్రజలు సైతం పలాసలో కలిసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. వారు సైతం శ్రీకాకుళం జిల్లా వైపు మొగ్గు చూపారు. దీంతో పలాస తో పాటు ఇచ్చాపురం నియోజకవర్గం జిల్లా అసాధ్యమని మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది. అందుకే పలాసను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు కూటమి పార్టీల నేతలు సైతం పెద్దగా పలాస జిల్లా పై మొగ్గు చూపలేదని సమాచారం. అందుకే పలాస ప్రత్యేక జిల్లా ఏర్పాటు అనేది ఇక జరిగే పని కాదని తేలిపోయింది.