https://oktelugu.com/

RTC bus: ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు నుంచి ఊడిన చక్రాలు .. తర్వాత ఏమైందంటే?

గోకవరం డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు గోకవరం నుంచి శాంతి ఆశ్రమం వైపు 65 మంది ప్రయాణికులతో బయలుదేరింది. సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో క్వారీ మార్కెట్ సమీపంలోకి వచ్చేసరికి బస్సు నుండి పెద్ద శబ్దం వచ్చింది.

Written By:
  • Dharma
  • , Updated On : February 19, 2024 / 12:36 PM IST
    Follow us on

    RTC bus: రోడ్డుపై వెళ్తున్న బస్సు చక్రాలు ఒక్కసారిగా ఊడిపోతే.. బస్సు నుంచి వేరు పడితే.. అటువంటి ఘటనను ఊహించుకోలేం కదా? కానీ ఏపీలో ఈ ఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు వెళుతుండగా చక్రాలు ఊడిపడ్డాయి. ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్కకు తప్పించడంతో ప్రమాదం తప్పింది.

    గోకవరం డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు గోకవరం నుంచి శాంతి ఆశ్రమం వైపు 65 మంది ప్రయాణికులతో బయలుదేరింది. సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో క్వారీ మార్కెట్ సమీపంలోకి వచ్చేసరికి బస్సు నుండి పెద్ద శబ్దం వచ్చింది. బస్సు దిగి చూడగా యాక్సిల్ విరిగి.. వెనుక ఎడమవైపు రెండు చక్రాలు ఊడిపోయి కొద్ది దూరం వెళ్ళిపోయాయి. అయితే అప్పటికే బస్సు నెమ్మదిగా ప్రయాణిస్తుండడం.. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రమాదం తప్పింది. లేకుంటే భారీ మూల్యం తప్పదని స్థానికులు చెబుతున్నారు. ఒకవైపు గుంతల రహదారులు, మరోవైపు కాలం చెల్లిన బస్సులను చూస్తున్న ప్రయాణికులు, ప్రజలు ప్రభుత్వానికి శాపనార్ధాలు పెడుతున్నారు.

    గుంతలు లేని ఏపీ రోడ్లను ఊహించుకోవడం కష్టం. గుంతలు లేని రోడ్డుపై ప్రయాణించాలని అనుకున్నారంటే అది భ్రమే. అడుగుకో గుంత.. అడిగితే తంటా అన్నట్టు పరిస్థితి ఉంది. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు ఒకవైపు.. గుంతల్లో రోడ్డు వెతుక్కోవడం మరోవైపు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎక్కడ ఆగిపోతుందో తెలియని పరిస్థితి. ఊడిపోయిన అద్దాలు.. నట్ బోల్టులతో రణ గొణ ధ్వనులు వినిపిస్తాయి. బస్సులో కూర్చొని కునుకు తీస్తామంటే కుదరదు. అంతలా పరిస్థితి మారిపోయింది. ఇక వర్షాకాలంలో అయితే చెప్పనక్కర్లేదు. బస్సులు కారిపోతుంటాయి. రంద్రాల ద్వారా నీరు చిమ్ముతుంది. చివరకు ప్రయాణికులే బస్సుల్లో గొడుగులు పట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఈ అవస్థల మధ్య ప్రయాణాలు సాగించలేక చాలామంది ప్రైవేట్ వాహనాలకు ఆశ్రయిస్తుంటారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం,శుభం, శుభప్రదం అన్న నినాదం బోర్డులకే పరిమితమవుతోంది.