Rayudu murder case: ఏపీలో జనసేన మహిళా నేత కోట వినూత మాజీ డ్రైవర్ హత్య కేసు సంచలనంగా మారుతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్ కోట వినూత వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన రాయుడు అనే యువకుడు చెన్నైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే రాయుడు మరణానికి కారణం కోట వినూత, చంద్రబాబు దంపతులేనని ఆరోపణలు వచ్చాయి. దీంతో జనసేన హై కమాండ్ స్పందించింది. జనసేన నుంచి ఆ దంపతులిద్దరిని వేటు వేసింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రైవేటు వీడియోల వ్యవహారమే కారణమని తెలుస్తుండడం కలకలం రేపుతోంది. రాయుడు హత్య వెనుక ఆ వీడియోలే కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
Also Read: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలేనా? నార్త్ కొరియా, రష్యా నుంచి జగన్ పిలిపించలేదా
చివరి నిమిషంలో మారిన సీన్..
శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని జనసేన పొత్తులో భాగంగా కోరినట్లు ఎన్నికల ముందు ప్రచారం నడిచింది. అయితే చివరి నిమిషంలో సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్లో ప్రైవేటు వీడియోల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఈ వీడియోలు బయటకు రావడంతో కోట వినూతకు టికెట్ రాకుండా పోయిందని ప్రచారం నడిచింది. అయితే నాటి వీడియోలే.. రాయుడు హత్యకు దారితీసాయని ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పట్లో సీక్రెట్ గా రాయుడు వీడియోలు తీయడం వల్లే.. వినూత తోపాటు ఆయన భర్త చంద్రబాబు రాయుడు పై కోపం పెంచుకున్నట్లు పోలీసుల రాజా విచారణలో తేలింది.
సీక్రెట్ కెమెరాలు పెట్టించారా?
కోట వినూత ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. రహస్యాలను చిత్రీకరించింది రాయుడేనని తెలుస్తోంది. అప్పట్లో బొజ్జల సుధీర్ రెడ్డి డ్రైవర్ రాయుడుతో మాట్లాడి ఆ సీక్రెట్ కెమెరాను అమర్చారని తెలుస్తోంది. అయితే ఇటీవల ఆ వీడియోలు బయటకు రావడం.. దాని వెనుక రాయుడు హస్తం ఉందని తెలియడంతోనే వినూత దంపతులు ఆయనను విధుల నుంచి తొలగించారని.. చిత్రహింసలు పెట్టారని పోలీసు విచారణలో తేలినట్లు సమాచారం. అయితే తాము రాయుడిని చంపలేదని వినూత దంపతులు పోలీస్ దర్యాప్తులో చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ కు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కారణమని వారు ఆరోపిస్తున్నట్లు సమాచారం. మున్ముందు ఈ పరిణామాలు టిడిపి ఎమ్మెల్యే మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.