Rayalaseema: కృష్ణ పొంగిపొర్లుతోంది. తుంగభద్ర నిండా నీటితో కళకళలాడుతోంది. కర్నూలులో వ్యవసాయం జోరందుకుంది. అనంతపురం పచ్చని పంటలతో సరికొత్తగా కనిపిస్తోంది. కడప ఆకుపచ్చ రంగును అలముకుంది. చిత్తూరు నిండుగా నీటితో.. మెండుగా పంటలతో శోభాయమానంగా కనిపిస్తోంది.
గతంలో ఎన్నడు లేని విధంగా.. గత 30 సంవత్సరాల లో చూడని విధంగా ఈసారి రాయలసీమలో బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కర్ణాటక పశ్చిమ కనుమల నుంచి ప్రవహిస్తున్న కృష్ణ, తుంగభద్ర రాయలసీమను రతనల సీమగా మార్చుతున్నాయి. కృష్ణ, తుంగభద్ర జూన్, జూలై నెలలోనే ముఖ్యమైన ప్రాజెక్టులను నింపాయి. ఈసారి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు నుంచి పూర్తిస్థాయి లో నీటిని విడుదల చేశారు. గతంలో కాల్వల సమస్య ఉండడంవల్ల నీటిని పూర్తిస్థాయిలో పంప్ చేసే అవకాశం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు కాల్వలు సమర్థవంతంగా ఉండడంతో జీడిపల్లి నుంచి మొదలు పెడితే పెన్నా అహోబిలానికి నీటి విడుదల సాధ్యమవుతున్నది. తుంగభద్ర నుంచి హై లెవెల్ కెనాల్ ద్వారా జీడిపల్లి నుంచి నాలుగు టీఎంసీల నీటిని పెన్న అహోబిలం బాలెన్సింగ్ రిజర్వాయర్లో నిల్వచేసే చేస్తున్నారు. ధర్మవరం కాల్వకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. వచ్చే రోజుల్లో 15 టీఎంసీల వరకు నీటిని తీసుకుంటారని తెలుస్తోంది. మిడ్ పెన్నా రిజర్వాయర్ ను కూడా నింపుతున్నారు. అయితే ఈసారి బైరవాణి తిప్ప సహజ ప్రవాహం తోనే నిండింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పేరూరు నిండుతోంది. దీంతో ఈ పరివాహక ప్రాంతంలో కూడా రైతుల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి.
Also Read: పులివెందులలో ఓటమి.. జగన్ కు ఓ గొప్ప గుణపాఠం
గాలేరు నగరి సుజల స్రవంతి మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా నిండిన నేపథ్యంలో.. రబీ పంటకు కూడా డోకా లేదని తెలుస్తోంది.. అయితే ఇవన్నీ సానుకూలంగా ఉన్నప్పటికీ తెలుగు గంగ ప్రాజెక్టుకు కాల్వల సామర్థ్యం లేకపోవడంతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 18 టీఎంసీలు. కాకపోతే 3000 క్యూసెక్కుల కంటే ఎక్కువగా నీటిని సరఫరా చేయడానికి అవకాశం లేదు. కాల్వలు సరిగా లేకపోవడం వల్ల వెలుగోడు మీద ఆధారపడ్డ రెండవ పంటకు మీరు అందే అవకాశం లేదు. ఒకవేళ తెలుగు గంగ ప్రాజెక్టుకు కాలువలు గనక నిర్మిస్తే.. రెండవ పంటకు కూడా నీటిని అందించవచ్చు.. అలగనూరు పథకానికి మరమతులు చేస్తే.. కుందూ ఆయకట్టును స్థిరి కరించవచ్చు. గుండ్రేవుల, , అరవీటి పల్లి, గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి లింకులు పూర్తి చేస్తే మడకశిర, చిత్తూరు చివరి వరకు నీరు అందుతుంది. అప్పుడు రాయలసీమ తనపై ఉన్న కరువు సీమ అనే పేరును శాశ్వతంగా తొలగించుకుంటుంది. ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తే.. ఆయన కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది.