Perni Nani: మాజీమంత్రి పేర్ని నాని మరింత ప్రమాదంలో పడ్డారు. ఆయన చుట్టూ రేషన్ బియ్యం ఉచ్చు బిగుసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కుటుంబానికి చెందిన గోదాం నుంచి భారీగా బియ్యం పక్కదారి పట్టినట్లు విచారణలో తేలింది. దీనిపై విజిలెన్స్ విచారణ కూడా పూర్తయింది. ప్రభుత్వానికి నివేదిక కూడా అందింది. ఇక అరెస్టులే తరువాయి అని ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లి పోయినట్లు టాక్ నడిచింది. అయితే ముందస్తు బెయిల్ కోసం ఆ కుటుంబం ప్రయత్నిస్తోందని.. అంతకుముందే ఆ బియ్యానికి సంబంధించిఫైన్ కూడా చెల్లించడంతో ఇక అరెస్టులు ఉండవని అంతా భావించారు.అయితే ఇప్పుడు కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది.పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాముల్లో 7577 బియ్యం బస్తాలు మాయం అయినట్లు.. ఆ బియ్యమంతా కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వెళ్లిపోయినట్లు మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
* పోయిన బియ్యం పై రాని క్లారిటీ
వైసిపి హయాంలో పేర్ని నాని భార్య జయసుధ పేరిట ఉన్న గోదాములను పౌరసరఫరాల శాఖ అద్దెకు తీసుకుంది.అయితే ఆ గోదాముల నుంచి రేషన్ బియ్యం పక్కదారి పట్టించే వారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇటీవల గోదాములో ఉండాల్సిన భారీ బియ్యం నిల్వలు మాయం అయినట్లు జయసుధ స్వయంగా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు కావడంతో పాటు విచారణ కూడా ప్రారంభం అయింది. డిసెంబర్ 10న కేసు నమోదు చేసిన బియ్యం ఎంత మాయం అయిందన్న విషయం మాత్రం గుర్తించలేకపోయారు. ఒకసారి వెయ్యి బస్తాలు.. మరోసారి మూడువేలు బస్తాలు పోయినట్లు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడుమంత్రి కొల్లు రవీంద్ర మాత్రం ఏకంగా 7577 బస్తాల బియ్యం మాయం అయినట్లు చెబుతున్నారు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్లు అయ్యింది.
* త్వరలో అరెస్టులు
ఇంతవరకు ఈ కేసునకు సంబంధించి.. ఎటువంటి అరెస్టులు జరగలేదు. తప్పకుండా అరెస్టులు ఉంటాయని ప్రచారం నడిచింది. దీంతో పేర్ని నాని కుటుంబం కొద్దిరోజుల పాటు అదృశ్యం అయినట్లు వార్తలు వచ్చాయి. ఈనెల 13న వైసిపి రైతాంగ సమస్యలపై ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా పేర్ని నాని ఎక్కడా కనిపించలేదు. అక్కడకు నాలుగు రోజుల తరువాత మచిలీపట్నం వచ్చారు. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పరామర్శించారు. ఇప్పుడు ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర బియ్యం విషయంలో స్పష్టతనిచ్చారు. అరెస్టులు తప్పవని సంకేతాలు ఇచ్చారు. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.