New Ration Cards AP: ఏపీలో( Andhra Pradesh) కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే నెల నుంచి కొత్త కార్డుల జారీకి రంగం సిద్ధమవుతోంది. వీటిని క్యూఆర్ కోడ్ తో రూపొందిస్తుండడం విశేషం. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. వాస్తవానికి ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత తొమ్మిది నెలలుగా అదిగో ఇదిగో అంటూ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి నుంచి కొత్త కార్డుల జారీకి రంగం సిద్ధమవుతోంది.
* ఎన్నికల్లో ప్రధాన హామీ
అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు( new ration cards ) జారీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏటా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టారు. అయితే అది తొలి నాలుగేళ్లకు మాత్రమే పరిమితం అయింది. గత ఏడాదిన్నరగా కొత్త కార్డుల జారీ అనేది లేకుండా పోయింది. వాస్తవానికి సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. కార్డులను క్యూఆర్ కోడ్ తో ఉండేలా.. ప్రత్యేక రంగుతో రూపొందించింది. కానీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప జారీ ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. దీనిపై విమర్శలు వస్తున్న క్రమంలో ప్రభుత్వం మార్చి నుంచి ఎట్టి పరిస్థితుల్లో రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
* మంత్రి మనోహర్ స్పష్టత
తాజాగా రేషన్ కార్డుల జారీ పై మాట్లాడారు మంత్రి నాదెండ్ల మనోహర్( Manohar ). మార్చి నుంచి క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు. మార్పులకు, చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో ఈ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని చెప్పారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన నేపథ్యంలో వచ్చేనెల నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే ఇది వరకే మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్యూఆర్ కోడ్ తోనే రేషన్ పొందే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన ప్రకటించారు.
* రాష్ట్రంలో భారీగా రేషన్ కార్డులు
రాష్ట్రవ్యాప్తంగా కోటి 48 లక్షల తెల్ల రేషన్ కార్డులు( white ration cards ) ఉన్నాయి. వీటిలో 90 లక్షల కార్డులు కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆహార భద్రత చట్టం కింద జారీ చేసినవి. ఈ కార్డులకు మాత్రమే కేంద్రం ఉచితంగా బియ్యం, తక్కువ ధరకు కందిపప్పు, పంచదారతో పాటు ఇతర సరుకులు అందిస్తోంది. మిగిలిన కార్డులను రాష్ట్ర ప్రభుత్వం రాసన్ సరుకులు అందిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ ముగిసిన వెంటనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.