Ramoji Rao: చట్టాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో.. వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేయాలో రాజ గురువు రామోజీకి తెలిసినట్టుగా.. మరి ఎవరికీ తెలియదు. మార్గదర్శి కేసుల విషయంలో ఆయన చూపుతున్న నేర్పరితనం, తప్పించుకునే నైజం స్పష్టంగా కనిపిస్తోంది. చేసిన తప్పు కనిపిస్తున్నా.. కోర్టులను తప్పుదోవ పట్టించి కాలం వెల్లదీసుకోవడం రామోజీరావుకు చెల్లినంతగా.. మరి ఎవరికి సాధ్యం కాదు.
మార్గదర్శి డిపాజిట్ల సేకరణ.. వాటి తరలింపు అన్నది పెద్ద కుట్ర. ఒక జిల్లాలో సేకరించిన డిపాజిట్లు.. జిల్లాను దాటించడం నిబంధనలకు విరుద్ధం. అది ముమ్మాటికి తప్పిదం. కానీ చట్టంలోనున్న లొసుగులు, తప్పుదోవ పట్టించే అంశాల్లో ఆరితేరిన రామోజీ.. ఈ రాష్ట్రంలో వద్దు.. ఆ రాష్ట్రంలో విచారణ చేపట్టండి.. అనారోగ్యంతో ఉన్నాను.. అచేతనంగా ఆసుపత్రి బెడ్ పై ఉన్నాను.. ఇలా లేనిపోని అంశాలతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించి మార్గదర్శి కేసుల విషయంలో ఉపశమనం పొందుతున్నారు. అసలు రామోజీరావు తప్పు చేయని రేంజ్ లో వ్యవహరిస్తుండడం దారుణం.
పైగా రామోజీరావు కి పొలిటికల్ సపోర్ట్ పుష్కలం. ఒక్క వైసీపీ నేతలు మినహాయించి… అన్ని పార్టీల నేతలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఆయన తరుపు వకాల్తా పుచ్చుకుంటున్నారు. సీఎం జగన్ పుట్టక ముందు నుంచే మార్గదర్శి ఉందని.. వైసిపి ఏర్పాటు చేయకముందే ఆ సంస్థ కొనసాగుతోందని.. కుట్రపూరితంగానే రామోజీపై కేసులు నమోదు చేశారని చెబుతుండడం విశేషం.
మార్గదర్శి నిధులను అక్రమ మార్గంలో మళ్ళించడాన్ని సమర్ధించాలా? రామోజీకి చట్టం, న్యాయం, నియమ నిబంధనలేవి వర్తించవా? అన్నింటికీ ఆయన అతీతమైన వ్యక్తా? అంటే పరిస్థితి అలానే ఉంది. ఇప్పటివరకు మార్గదర్శిపై ఎవరు ఫిర్యాదు లేదని వాదిస్తున్నారు? ఫిర్యాదు లేకపోతే అక్రమాలు సక్రమాలైపోతాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చేసిన చట్ట వ్యతిరేకమైన పనిని చట్టబద్ధంగా ఎలా సమర్థించుకుని తప్పించుకోవచ్చో.. రకరకాలుగా రామోజీ ఎత్తుగడలు వేస్తున్నారు. తప్పించుకోవాలని చూస్తున్నారు. చట్టంలో ఉన్న లొసుగులను, న్యాయ పరిమితులను దాటి, కోర్టులను తప్పుదోవ పట్టించి కాలం సాగదీస్తున్నారు. కానీ ఈ దేశంలో ఎంతటి పెద్దవాడైనా చట్టం ముందు సామానుడే అన్న విషయాన్ని రామోజీ మరచి వ్యవహరిస్తున్నారు. దీనికి కాలమే సమాధానం చెప్పనుంది.