Ram Mohan Naidu: పాలనలో వైఫల్యాలు అనేవి సర్వసాధారణం. రాజకీయ పార్టీలతోపాటు ప్రభుత్వాలకు సంక్షోభాలు ఎదురవుతాయి. వాటిని మరింత జఠిలం చేసుకోవడం కంటే పరిష్కార మార్గం చూపించుకోవడం అనేది ఉత్తమం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు( Ram Mohan Naidu ) ఇప్పుడు అదే చేశారు. గత కొద్దిరోజులుగా దేశంలో ఇండిగో విమాన సంక్షోభం ఎదురైంది. లక్షలాదిమంది విమాన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సహజంగానే దీనిని భూతద్దంలో పెట్టి చూపి రామ్మోహన్ నాయుడును అదే పనిగా కించపరచడం ప్రారంభించారు. ఒక యువనేతగా, జాతీయస్థాయిలో ఎదుగుతున్న నాయకుడిగా రామ్మోహన్ నాయుడు సంయమనంతో వ్యవహరించారు. ఎక్కడైతే విమర్శలు ఎదుర్కొన్నారో.. అక్కడి నుంచే నివృత్తి చేసే పనిని మొదలుపెట్టారు. విమర్శించిన వారి నోటి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. నిజంగా ఈ విషయంలో రామ్మోహన్ నాయుడుకు అభినందించాల్సిందే. ఎందుకంటే విమాన సంక్షోభం కాబట్టి ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఓ ప్రైవేట్ ఎయిర్లైన్స్ తన కంపెనీలో సంక్షోభాన్ని చివరిదాకా దాచింది. దాని పర్యవసానమే ఇంతటి సంక్షోభం.
* రచ్చ చేసిన ఆర్నాబ్..
ప్రధానంగా నేషనల్ మీడియాకు( National media) రామ్మోహన్ నాయుడు వ్యతిరేకం కావడానికి జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి ఒకరు. ఆయన బిజెపి జర్నలిస్ట్. బిజెపి కోసం ఎవరినైనా బలిపశువు చేయగల సమర్థత ఈ పాత్రికేయుడు సొంతం. ఉగ్రవాదుల దాడి ఈయనకు కనిపించలేదు. రైలు ప్రమాదాలు ఈయనకు కనిపించలేదు. పైగా వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహులు అన్న ముద్ర వేయడానికి కూడా వెనుకడుగు వేసే వారు కాదు. కానీ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు పై బురద జల్లారు. కనీసం దానిని కడుక్కునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా తప్పుపట్టారు. అయితే ఆయన విషయాన్ని పక్కన పెడదాం. ఇండిగో విమాన సంక్షోభాన్ని చక్కదిద్దారు రామ్మోహన్ నాయుడు. 10 శాతం సర్వీసులను ఇతర ఎయిర్లైన్స్ అప్పగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
* వరుస పెట్టి ఇంటర్వ్యూలు..
మరోవైపు ఇంతటి సంక్షోభానికి కారణం? ఎందుకు అలా జరిగింది? తీసుకున్న దిద్దుబాటు చర్యలేంటి? భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా తీసుకున్న చర్యలు ఏంటి? అనే వాటిని వివరిస్తున్నారు కింజరాపు రామ్మోహన్ నాయుడు నేషనల్ మీడియా ద్వారా. టైమ్స్ నౌ నుంచి ఇండియా టుడే దాకా అన్ని ఛానళ్లకు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అసలేం జరిగింది అనే దానిపై వివరణ ఇస్తున్నారు. ఈ క్రమంలో తనకు ప్రశ్నలు, అవమానకర వ్యాఖ్యలు ఎదురవుతున్న లెక్క చేయడం లేదు. వాటికి ఒక పద్ధతి ప్రకారం సమాధానాలు చెబుతున్నారు. చివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వ్యతిరేక ముద్రపడిన మీడియాకు సైతం ఇంటర్వ్యూలు ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రామ్మోహన్ నాయుడు ఇస్తున్న నివృత్తి కరమైన సమాధానాలను చూసి బిజెపిని వ్యతిరేకించే రాజీవ్ సర్దేప్ శాయి సైతం ఆయనను అభినందించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తప్పులు జరగవచ్చు కానీ వాటిని సరిదిద్దుకునే తీరులో కూడా కొందరు సమర్థత చూపుతారు. ఈ విషయంలో మాత్రం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందనలు అందుకుంటున్నారు.