AP Rajya Sabha elections: ఏపీలో( Andhra Pradesh) రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఏడాది జూన్ తో ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. అంతకంటే ముందే వారి స్థానంలో కొత్తవారి ఎన్నిక జరగనుంది. అయితే కూటమికి స్పష్టమైన బలం ఉండడంతో.. ఆ నాలుగు స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. వైసిపి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఆ పార్టీకి ఛాన్స్ లేదు. ఆ పార్టీ పోటీ చేయదు కూడా. ప్రస్తుతం వైసీపీకి ఏడుగురు ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో. అయితే ముగ్గురు ఖాళీ కానుండడంతో నలుగురు సభ్యులు మిగలనున్నారు. అయితే కూటమి పార్టీలో మాత్రం చాలా మంది ఆశావహులు ఉన్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.
నాలుగు పదవులు ఖాళీ..
ఈ ఏడాది జూన్లో ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి చెందిన సానా సతీష్, వైసీపీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక అనివార్యం. ఏడాది కిందట సాన సతీష్ టిడిపి తరఫున గెలవడంతో ఆయనకు రెన్యువల్ చేయనున్నారు. అయితే మిగతా మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలను తీసుకుంటుంది? జనసేనకు ఎన్ని? బిజెపికి ఎన్ని? అనేది చర్చ నడుస్తోంది. అయితే మొత్తం నాలుగు ఎంపీ స్థానాల్లో టిడిపికి మూడు, జనసేనకు ఒకటి దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో జనసేనకు అవకాశం కల్పించలేదు. బిజెపి ఎక్కువ ఎంపీ పదవులను దక్కించుకుంది. అందుకే ఈసారి బిజెపికి ఛాన్స్ లేదని.. జనసేనకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
విపరీతమైన పోటీ..
తెలుగుదేశం పార్టీకి మూడు పార్లమెంట్ స్థానాలకు గాను.. ఒకటి సానా సతీష్ కు( Sana Satish ) కొనసాగింపు ఉంటుంది. మిగతా రెండు ఎంపీ పదవుల కోసం పార్టీలో విపరీతమైన పోటీ ఉంది. ముఖ్యంగా వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, దేవినేని ఉమామహేశ్వరరావు.. ఇలా చాలామంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వర్ల రామయ్య గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడే ఓడిపోతానని తెలిసి రాజ్యసభకు పోటీ చేశారు. అందుకే తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు యనమల రామకృష్ణుడు సైతం రాజ్యసభ పదవి పై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రస్థాయిలో అన్ని రకాల పదవులు అనుభవించారు. అందుకే ఇప్పుడు పెద్దల సభకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. భాష్యం రామకృష్ణ సైతం ఎంపీగా పోటీ చేయాలని చూశారు. అప్పట్లో అవకాశం దక్కలేదు. రాజ్యసభ ద్వారా ఆ కోరిక తీర్చుకోవాలని చూస్తున్నారు. గల్లా జయదేవ్ అయితే 2024 ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అయినా సరే పార్టీతో అనుబంధం ఎక్కువ. రాజ్యసభ పదవి కోరుకుంటున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు అయితే పార్టీ కోసం టికెట్ వదులుకున్నారు. తనకు రాజ్యసభ ఇవ్వాలని కోరుతున్నారు.
ఆ స్థాయి వ్యక్తులకే ఛాన్స్..
అయితే సాధారణంగా రాజ్యసభ పదవి అంటే కార్పొరేట్ సెక్షన్ తో కూడుకున్నది. జాతీయస్థాయిలో సంబంధాలు, పెద్ద పెద్ద వ్యవహారాలు చూసేవారికి ఆ పదవి కట్టబెడతారు. అందుకే ఈసారి కొత్త వ్యక్తులకు అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అనూహ్యంగా కొందరు వ్యక్తులు తెరపైకి వచ్చే అవకాశం ఉందని టిడిపి వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత నిజం ఉందో చూడాలి. కానీ ఆశావహులు మాత్రం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.