Rajya Sabha by-election : రాజ్యసభ సభ్యుల ఎంపిక దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడింది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యింది. వైసీపీకి చెందిన బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.రాజ్యసభ పదవులతోపాటు పార్టీకి సైతం రాజీనామా చేశారు. మస్తాన్ రావు తో పాటు మోపిదేవి వెంకటరమణ టిడిపిలో చేరారు. ఆర్ కృష్ణయ్య మాత్రం బిజెపికి దగ్గరవుతున్నారు. అయితే ఇప్పుడున్న సంఖ్యాబలం బట్టి కూటమికి ఈ మూడు పదవులు దక్కినట్టే. అయితే మూడు పార్టీలు చేరో పదవి చొప్పున తీసుకుంటాయన్న ప్రచారం నడిచింది.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి రెండు,జనసేనకు ఒకటి అన్నట్లు టాక్ నడిచింది. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో టిడిపికి రెండు, బిజెపికి ఒకటి ఖరారు అయినట్లు సమాచారం.వ్యూహాత్మకంగా జనసేన పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది.
* మస్తాన్ రావుకు మరో ఛాన్స్
తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీదా మస్తాన్ రావుకు మరోసారి పదవి ఖరారయ్యే అవకాశం ఉంది. టిడిపిలో చేరితే రాజ్యసభ పదవి రెన్యువల్ చేయాలన్నది మస్తాన్ రావు కోరికగా తెలుస్తోంది.పైగా ఆయన పూర్వశ్రమంలో టిడిపి నేత.అందుకే ఆయనకు పదవి ఇస్తారని తెలుస్తోంది.మరో పదవి విషయంలో మాత్రం పోటీ నడుస్తోంది. కంభంపాటి రామ్మోహన్ రావు,గల్లా జయదేవ్, సానా సతీష్ ల మధ్య పోటీ నెలకొంది. సానా సతీష్ కు ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
* బిజెపిలో ఆయనకే
బిజెపికి సంబంధించి చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది.ఆయన విషయంలో చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నట్లు టాక్ నడిచింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆర్ కృష్ణయ్యకు బిజెపి నుంచి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. తెలంగాణకు చెందిన కృష్ణయ్య సేవలను ఆ రాష్ట్రంలో వినియోగించుకునేందుకు బిజెపి పెద్దలు ఒక ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. కృష్ణయ్య కోసమే పవన్ మెత్తబడ్డారని తెలుస్తోంది. జనసేన రాజ్యసభ సీటును బిజెపికి ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు టిడిపి నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్, బిజెపి నుంచి ఆర్ కృష్ణయ్య పేర్లు దాదాపు ఖరారు అయ్యాయని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.