Rajya Sabha
Rajya Sabha: ఏపీలో ( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. మూడు పార్టీల మధ్య స్పష్టమైన సమన్వయం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న నాయకత్వాలు మాత్రం ఐక్యంగా ఉన్నాయి. ఐక్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మూడు పార్టీల మధ్య పదవుల పంపకాలు సవ్యంగా సాగుతున్నాయి. మొన్నటికి మొన్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రాగా.. ఐదింటిని కూటమి పార్టీలే దక్కించుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి మూడు ఎమ్మెల్సీ సీట్లు దక్కాయి. బిజెపి, జనసేన చెరో పదవిని పంచుకున్నాయి. అంతకుముందు మూడు రాజ్యసభ స్థానాలకు గాను రెండింటిని టిడిపి తీసుకుంది. జనసేన త్యాగం చేయడంతో ఆ ఒక్క పదవిని బిజెపి పొందగలిగింది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ పదవి కోసం మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. కానీ ఆ సీటు సైతం కోరుకుంటుంది బిజెపి. ఆ పార్టీ అగ్రనేతల విన్నపం మేరకు చంద్రబాబుతో పాటు పవన్ సైతం అంగీకరించినట్లు ప్రచారం సాగుతోంది.
* సాయి రెడ్డి రాజీనామాతో..
కొద్దిరోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాజ్యసభ పదవిని సైతం ఆయన వదులుకున్నారు. దీంతో ఆ ఒక్క సీటుకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలో ఎలక్షన్ కమిషన్ ఈ రాజ్యసభ పదవికి నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే అనూహ్యంగా ఆ పదవి బిజెపికి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే బిజెపిలో చాలామంది ఆశావహులు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఆ పదవి ఇవ్వాలని బిజెపి నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఆ పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే జాతీయ అవసరాల దృష్ట్యా బిజెపి పెద్దలు ఆ పదవిని వేరే వ్యక్తికి సూచిస్తున్నట్లు సమాచారం.
* సార్వత్రిక ఎన్నికల్లో నో ఛాన్స్..
సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ విశాఖ పార్లమెంట్ స్థానాన్ని ఆశించారు జీవీఎల్ నరసింహం( gvl Narasimham ). గతంలో ఆయన బిజెపి తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. విశాఖలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా బిజెపికి అనకాపల్లి పార్లమెంట్ స్థానం కేటాయించారు. అక్కడ నుంచి బిజెపి అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేసి గెలిచారు. దీంతో జివిఎల్ కు అవకాశం లేకుండా పోయింది. అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జీవీఎల్ ఉండేవారు. అందుకే ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం చిక్కలేదని అప్పట్లో ప్రచారం నడిచింది.
* ఆశావహులు అధికం..
ప్రస్తుతం బిజెపిలో చాలామంది ఆశావహులు ఉన్నారు. కానీ ప్రధానంగా జివిఎల్, కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ) మధ్య గట్టి ఫైట్ నెలకొంది. ఇద్దరిలో ఒకరికి రాజ్యసభ పదవి ఖాయమని ప్రచారం నడుస్తోంది. అయితే బిజెపి పెద్దలు మాత్రం జివిఎల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబుతో పాటు ఏపీ కూటమి నేతలు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. మరి ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి.