Rainfall Alert in AP Districts: ఆంధ్రప్రదేశ్ కు( Andhra Pradesh) భారీ వర్ష సూచన. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చని స్పష్టం చేసింది. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, భారీగా పిడుగులు పడవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయింది. నాలుగు రోజులపాటు పరిస్థితి ఇలానే కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.
Also Read: Heavy rain alert Bay of Bengal : బంగాళాఖాతంలో ద్రోణి.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!
తిరుమలలో భారీ వర్షం..
ప్రధానంగా తిరుమలలో( Tirumala) వాతావరణం పూర్తిగా మారిపోయింది. శుక్రవారం భారీ వర్షం పడింది. కొండపై ఆహ్లాదకర వాతావరణంలో భక్తులు ప్రకృతిని ఆస్వాదిస్తూ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతపురం జిల్లాలో సైతం భారీ వర్షం పడింది. విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు మండలాల్లో భారీ వర్షం నమోదయింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రికార్డు స్థాయిలో 96.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో ఎటు చూసినా వరద నీరు కనిపించింది. భారీ వర్షాలకు చెరువులు పొంగాయి. కాలువల్లో ఉదృతంగా నీరు చేరడంతో పొంగి ప్రవహిస్తూ కనిపించాయి. కృష్ణాజిల్లాలో సైతం భారీ వర్షాలు నమోదయ్యాయి. గుడ్లవల్లేరు, తాడిచర్ల, చినగొన్నూరు, కోరాడ, విన్నకోట, కౌతవరం, వేమవరం, వడ్లమన్నాడు, దగ్గు ముల్లి లో 16.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో కాలువల్లో భారీగా నీరు చేరి పొంగి ప్రవహించాయి.
Also Read: AP Weather : ఏపీలో చురుగ్గా రుతుపవనాలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!
రుతుపవనాల ప్రభావంతో..
ఈ ఏడాది దేశానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు తాకాయి. మే 23 నాటికి కేరళ ( Kerala)తీరాన్ని తాకి త్వరగా విస్తరించాయి. వీటి ప్రభావంతో వర్షాలు పడ్డాయి. ఏపీలో సైతం విస్తారంగా వర్షాలు కురిసాయి. మే నెలలో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయింది. అయితే మధ్యలో రుతుపవనాలు మందగించాయి. దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఇప్పుడు రుతుపవనాల కదలికలో మార్పు వచ్చింది. మళ్లీ వర్షాలు ప్రారంభం అయ్యాయి. తాజాగా ఆవర్తనంతో పాటు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ ఈదురుగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.