Rain Alert AP: ఏపీ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోంది. చలి తీవ్రత పెరిగింది. గత నెలలో విస్తారంగా వర్షాలు కురిసాయి. తగ్గుముఖం పట్టడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకోవైపు ఒకేసారి చలి తీవ్రత పెరగడంతో పిల్లలనుంచి పెద్దవారు వరకు అసౌకర్యానికి గురవుతున్నారు. ఖరీఫ్ లో భాగంగా వరి కోతలు కూడా ప్రారంభం అయ్యాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. భారీ వర్ష సూచన ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది తుఫాన్ గా మారి అవకాశం ఉందని కూడా అంచనా వేస్తోంది. దీంతో ఏపీకి వర్ష హెచ్చరిక తప్పేలా లేదు.
* ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం..
దక్షిణ అండమాన్ సమీపంలో.. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది పశ్చిమంగా ప్రయాణించే క్రమంలో బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ కోస్తా వైపు రానుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం దక్షిణ కోస్తా ప్రాంతం పై ఉంటుందని కూడా చెబుతున్నారు. అయితే దీనికంటే ముందుగా మరో నాలుగు ఐదు రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఒకటి ఏర్పడి.. దక్షిణ తమిళనాడు దిశగా విస్తరించనుంది. ఈ రెండు విపత్తుల ప్రభావంతో ఏపీలో దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయి.
* పెరిగిన చలిగాలులు..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత పెరిగింది. దక్షిణ భారతదేశం పైకి చలిగాలులు వీస్తుండడంతో.. ఆ ప్రభావం ఏపీ పై కూడా పడింది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గుముఖం పట్టాయి. సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదు అవుతున్నాయి. జి మాడుగులలో 11.6, వజ్ర కరూర్ లో 11.8, అనంతపురంలో 15.5, ఆరోగ్యవరంలో 16, నందిగామ, జంగమహేశ్వరపురం లలో 17.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని రోజులపాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది.