Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. క్రమంగా ఇది అల్పపీడనంగా మారనుంది. వచ్చే 24 గంటల్లో పూర్తిస్థాయిలో అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.ప్రస్తుతం బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ఈ ఆవర్తనం స్థిరంగా ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. అల్పపీడనంగా మారిన తర్వాత క్రమంగా పశ్చిమ దిశగా కదలనుంది.తమిళనాడు, పుదుచ్చేరి, శ్రీలంక తీరం వైపు తన దిశను మార్చుకోనుంది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ప్రకాశం,నెల్లూరు,తిరుపతి,చిత్తూరు,కడప,అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావచ్చు. ఉత్తర కోస్తాలో సైతం చెదురు మదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* నేడు భారీ వర్షాలు
కాగా ఈ ఆవర్తన ప్రభావంతో నేడు కూడా వర్షాలు కురవనున్నాయి.కాకినాడ,అంబేద్కర్ కోనసీమ,నెల్లూరు,అన్నమయ్య రాయచోటి,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.మంగళవారం నెల్లూరు,శ్రీ సత్య సాయి పుట్టపర్తి,కడప,అన్నమయ్య రాయచోటి,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో విశాఖ, కాకినాడ,అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.బుధవారం సైతం కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
* తమిళనాడు పై ప్రభావం
అటు తమిళనాడు పై కూడా అల్పపీడన ప్రభావం ఉండనుంది. చెన్నై సహా ఉత్తర కోస్తా జిల్లాలైన చంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట్, తిరుపత్తూరు, కడలూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు దక్షిణ ప్రాంత జిల్లాలైన విల్లుపురం, తంజావూరు, తిరువరూర్, నాగపట్నం, మైలాడుతురై, పుదుకోటై, రామనాథపురం, కాళ్ళ కురిచి, తుత్తుకుడి, దిండిగల్, మధురై జిల్లాల్లో సైతం భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.