YS Sharmila: షర్మిలకు అండగా రాహుల్ గాంధీ

జగన్ షర్మిలను వదులుకున్నారు. తన కుటుంబంలో చిచ్చుకు షర్మిల కారణమని ఆరోపించారు. కానీ అదే షర్మిల ఇప్పుడు రాహుల్ గాంధీని తన సోదరుడిగా చెప్పుకుంటున్నారు. అదే రాహుల్ షర్మిలను సొంత చెల్లెలుగా పరిగణిస్తున్నారు.

Written By: Dharma, Updated On : May 11, 2024 5:32 pm

YS Sharmila

Follow us on

YS Sharmila: వైయస్ రాజశేఖర్ రెడ్డిది కాంగ్రెస్ భావజాలం. ఆయన కాంగ్రెస్ లోనే పుట్టారు. కాంగ్రెస్ లోనే ఎదిగారు. కాంగ్రెస్ లో ఉంటూనే చనిపోయారు. ముఖ్యంగా గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. ఆ విధేయత 2004లో రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది. 2009లో రెండోసారి పదవిని దరి చేర్చింది. అయితే వైయస్ అకాల మరణంతో పరిస్థితి చేజారింది. జగన్ తన రాజకీయ ఉన్నతిని వెతుక్కుంటూ సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలతో షర్మిల తండ్రి బాట పట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరి పగ్గాలు అందుకున్నారు.

అయితే జగన్ షర్మిలను వదులుకున్నారు. తన కుటుంబంలో చిచ్చుకు షర్మిల కారణమని ఆరోపించారు. కానీ అదే షర్మిల ఇప్పుడు రాహుల్ గాంధీని తన సోదరుడిగా చెప్పుకుంటున్నారు. అదే రాహుల్ షర్మిలను సొంత చెల్లెలుగా పరిగణిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని విభేదించే సమయంలో జగన్ కంటే ముందుగా కుటుంబ సభ్యులే రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ తమ కుటుంబాన్ని వంచించిందని ఆరోపణలు చేశారు.ముఖ్యంగా నాడుషర్మిల సైతం కాంగ్రెస్ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జగన్ తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అండగా నిలవడం విశేషం.

తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ షర్మిలకు మద్దతుగా కడపలో ఎన్నికల ప్రచారం చేశారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి లు సోదరులుగా మెలిగారని గుర్తు చేసుకున్నారు. అవినీతి కేసుల కు సంబంధించి చార్జిషీట్లో వైయస్సార్ పేరును కాంగ్రెస్ పార్టీ చేర్చలేదని స్పష్టం చేశారు. ఎవరో వారి స్వలాభం కోసం చేసిన పని ఇది అంటూ కామెంట్స్ చేశారు. వైయస్సార్ విలువలు, సిద్ధాంతాలు పార్లమెంటులో వినపడాలంటే తన సోదరి షర్మిలను గెలిపించాలని కోరారు. ఆమెను గెలిపిస్తామని కడప జిల్లా ప్రజలు తనకు మాట ఇవ్వాలని రాహుల్ గాంధీ కోరడం విశేషం. ఒకవైపు రాహుల్ పర్యటన కొనసాగుతుండగా.. మరోవైపు వైయస్ విజయమ్మ విదేశాల నుంచి షర్మిలకు మద్దతుగా ప్రత్యేక వీడియో విడుదల చేయడం విశేషం.