Raghu Rama Krishna Raju: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఇటీవలే ఆయన వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇంతవరకు ఏ పార్టీలో చేరతారో ప్రకటన చేయలేదు. తాడేపల్లిగూడెం, ప్రత్తిపాడు జెండా సభల్లో మాత్రం రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. అయితే ఆయన బిజెపిలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు బిజెపి నుంచి పొత్తు విషయంలో స్పష్టత లేదు. తప్పకుండా ఆ పార్టీ కలిసి వస్తుందని ఇటు టిడిపి, అటు జనసేన నమ్మకంగా చెబుతున్నాయి. ఈ మూడు పార్టీల్లో.. ఏదో ఒక పార్టీలో చేరి రఘురామ పోటీ చేస్తారని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానానికి రఘురామకృష్ణంరాజు పోటీ చేశారు. వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన ఆరు నెలలకి వైసీపీ నాయకత్వంతో విభేదించారు. ఈ క్రమంలో రఘురామరాజుకు ఇబ్బంది పెట్టడం.. ఆయన ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడడం రివాజుగా మారింది. ఈ క్రమంలో ఆయనపై అనర్హత వేటు వేయడానికి వైసిపి ప్రయత్నించింది. కానీ బిజెపి అగ్ర నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో రఘురామకృష్ణం రాజు ఆ ప్రయత్నాలను అడ్డుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో వైసీపీకి రాజీనామా ప్రకటించారు. ఆ మూడు పార్టీల్లో.. ఏదో ఒక పార్టీలో చేరి పొ త్తులో భాగంగా నరసాపురం ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా టిడిపి, జనసేన బహిరంగ సభల్లో రఘురామ నేరుగా పాల్గొనడం విశేషం.
అయితే రఘురామకృష్ణం రాజు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇటీవల 94 మంది అభ్యర్థులను టిడిపి ప్రకటించిన సంగతి తెలిసిందే. తీవ్ర మదింపు తర్వాత.. సర్వేల ఆధారంగా ఈ ఎంపిక చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు నరసాపురం పార్లమెంట్ స్థానం పరిధిలోనే ఇటువంటి సర్వే జరుగుతోంది. అందులో టిడిపి అభ్యర్థులు నలుగురు పేర్లు ప్రస్తావన వస్తోంది. అందులో మొదటి పేరు రఘురామకృష్ణం రాజుదే. దీంతో ఆయన టిడిపిలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు. కొన్నేళ్లుగా చంద్రబాబు ఢిల్లీ వెళ్తే ఆయన వెంట కనిపిస్తున్నారు. బిజెపితో పొత్తుకు రఘురామకృష్ణంరాజు ఎంతగానో సహకరించినట్లు కూడా తెలుస్తోంది. టిడిపి అభ్యర్థి అయితే.. పొత్తులు కుదిరితే.. మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కుదురుతుందని.. రఘురామకృష్ణం రాజు మరోసారి ఎంపీ అవడం ఖాయమని తెలుస్తోంది. మొత్తానికైతే రఘురామకృష్ణం రాజు టిడిపిలో చేరడం పై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. అయితే తన రెబల్ చర్యలతో జగన్ కే ముచ్చెమటలు పట్టించారు. అటువంటిది చంద్రబాబు, పవన్ లను సైతం ఒప్పించి తన చేరికకు మార్గం సుగమం ఎలా చేసుకున్నారన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగులుతోంది.