Raghurama Krishnam Raju: రఘురామకృష్ణం రాజు పై క్రిమినల్ కేసులు.. వైసీపీ సర్కార్ కౌంటర్ అటాక్

రఘురామ మరింత రెచ్చిపోయారు. జగన్ సీఎం అయిన తర్వాత అవినీతికి పాల్పడుతున్నారని.. అస్మదీయులకు మేలు చేస్తున్నారని.. సిబిఐ విచారణకు రఘురామ డిమాండ్ చేశారు.

Written By: Dharma, Updated On : February 16, 2024 1:20 pm
Follow us on

Raghurama Krishnam Raju: ఏపీ సీఎం జగన్, రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. గెలిచిన ఆరు నెలలకే వైసీపీకి రఘురామకృష్ణంరాజు దూరమయ్యారు. ఏకంగా వైసీపీ సర్కార్ తో పాటు సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో రఘురామకృష్ణం రాజు పై రాజద్రోహం కేసు సైతం నమోదు చేశారు. ఏకంగా హైదరాబాద్ వెళ్లి ఏపీ ఏసీబీ అధికారులు రఘురామకృష్ణంరాజును అరెస్టు చేశారు. ఏపీకి తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అప్పటినుంచి రఘురామ మరింత రెచ్చిపోయారు. జగన్ సీఎం అయిన తర్వాత అవినీతికి పాల్పడుతున్నారని.. అస్మదీయులకు మేలు చేస్తున్నారని.. సిబిఐ విచారణకు రఘురామ డిమాండ్ చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. అయితే రఘురామకృష్ణంరాజు సైతం అవినీతిపరుడు అంటూ ప్రభుత్వ న్యాయవాది కౌంటర్ ఎటాక్ చేయడం విశేషం.

సీఎం జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని.. ప్రభుత్వ కాంట్రాక్టులని అధిక మొత్తం పెంచి ఆయన అనుచరులకే అప్పగిస్తున్నారంటూ రఘురామ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ తరుపు న్యాయవాది మురళీధర్ తన వాదనలు వినిపించారు. ఉమ్మడి ఏపీలో తండ్రి రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ అడ్డగోలు దోపిడీ చేశారని.. క్విడ్ ప్రోకు పాల్పడ్డారని.. ఈ క్రమంలోనే సిబిఐ కేసులు నమోదయ్యాయని.. అయితే అప్పట్లో కేసులు వల్ల నష్టపోయిన వారిని ఇప్పుడు సీఎం హోదాలో జగన్ లబ్ధి చేకూర్చుతున్నారని వాదించారు. అందుకే వైసీపీ సర్కార్ కేటాయింపులపై సిబిఐతో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.

ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున న్యాయవాది శ్రీరామ్ గట్టి వాదనలే వినిపించారు. పిటిషనర్ రఘురామకృష్ణం రాజు పై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. ఆ విషయాన్ని ఆయన కోర్టుకు చెప్పలేదని వాదించారు. సీఎం జగన్ తో పిటిషనర్ కు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని.. కక్ష కట్టి కావాలని ఆయన ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సీఎం జగన్ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాబట్టి ఈ పిల్ వేసేందుకు రఘురామ అనర్హుడంటూ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.