Purandheswari : ఏపీ బీజేపీ చీఫ్ గా నియమితులై చిన్నమ్మ భాష, యాస బాగుంటుంది. ఎన్టీఆర్ తనయిగా క్రమశిక్షణ కట్టుదిట్టంగా ఉంటుంది. అందుకే బీజేపీ హైకమాండ్ ఆమె సేవలను గుర్తించి పార్టీ బాధ్యతలను అప్పగించింది. అయితే ఆమెకు పదవి అనూహ్యమే అయినా.. అది దక్కడం వెనుక మాత్రం హైకమాండ్ పెద్ద స్కెచ్ ఉంది. వైసీపీ, టీడీపీకి సమదూరం పాటించగల సమర్థత ఉందన్నది ప్రగాడ నమ్మకం. అందుకు తగ్గట్టుగానే ఆమె తొలి మీటింగులోనే చాతుర్యం ప్రదర్శించారు. మున్ముందు తన నడత, నడవడిక ఎలా ఉంటుందో సంకేతాలిచ్చారు. తెలంగాణలో బండి సంజయ్, తమిళనాడులో అన్నామలై తరహాలో దూకుడుగా వ్యవహరించాలని డిసైడయినట్టున్నారు.
చిన్నమ్మ తొలి సమావేశంలోనే ఓ స్పష్టతనిచ్చారు. ఏపీ బీజేపీలో నేతలకు, పెద్దతలకాయలకు కొదువ లేదు. మూడు ప్రాంతాల్లో ఉండే నాయకులు ముప్పై ఆలోచనలతో ఉంటారు. హైకమాండ్ వద్ద పలుకుబడి ఉందని కొందరు, బీజేపీ పునాదులు నిర్మించామని మరికొందరు, తమకు తిరుగులేని చరిష్మ ఉందని ఇంకొందరు. ఇలా అందర్నీ ఒక వేదికపైకి తెచ్చారు. మున్ముందు ఎలా ఉంటుందో తెలియజెప్పారు. మాట్లాడకుండానే చాలా విషయాలపై స్పష్టతనిచ్చారు. ఒక చిన్న సంఘటనతో చిన్నమ్మ విశ్వరూపం చూపించారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన ఐదు నిమిషాలకే.. నిన్న, ఈరోజు, రేపు బీజేపీకి పొత్తు ఉండేది జనసేనతో మాత్రమేనని చెప్పడం ద్వారా పార్టీ లైన్ దాటవద్దని నేతలకు గట్టి అల్టిమేటం ఇచ్చారు.
బీజేపీని కోఆర్డినేట్ చేయడం కష్టం. నేతలందర్నీ ఏకతాటిపైకి తేవడం ఇబ్బందికరం. ఇటువంటి ప్రశ్నలు, సవాళ్లు చిన్నమ్మ ముందు నిలిచాయి. ఎలా డీల్ చేస్తారోనన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. భిన్న ఆలోచనలతో ఉండే బీజేపీ నేతలకు రాష్ట్ర అధ్యక్షులంటే చులకన భావం. తమకంటే వారు తోపులు కాదన్నది వారి భావన. ఇంతకు ముందు అధ్యక్ష పదవులు అనుభవించిన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులకు ఇటువంటి అనుభవాలే ఉన్నాయి. అయితే ఈపాటికే నేతలను స్టడీ చేసిన చిన్నమ్మ చార్జ్ తీసుకుంటూనే కౌంటర్ అటాక్ ప్రారంభించారు.
వాస్తవానికి పురందేశ్వరికి పార్టీ బాధ్యతలు అప్పగించడం ఒక సాహసం. బీజేపీలోని చాలామంది నాయకులను విస్మయపరచింది. చంద్రబాబుతో ఇటీవల దగ్గుబాటి కుటుంబం దగ్గర కావడమే అందుకు కారణం. ఆమె టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ప్రచారం సాగింది. ఇటువంటి సమయంలో ఆమెకు బాధ్యతలు ఇవ్వడం ఓకింత ఆశ్చర్యం వేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో బ్యాలెన్స్ గా వెళ్లాలి. లేకుంటే ఇంతకు ముందున్న అధ్యక్షులు మాదిరిగా వైసీపీ, టీడీపీ ముద్రపడే చాన్స్ ఉంది. పైగా ఆమె ఎన్టీఆర్ బిడ్డ. మొన్నటివరకూ వైసీపీ సర్కారు విధానాలను గట్టిగానే వ్యతిరేకించారు. వైసీపీ వరకూ ఫర్వాలేకున్నా.. టీడీపీలో ఎలా వ్యవహరిస్తారన్నదే ఇప్పుడు అసలు సిసలు సమస్య. కానీ ఆమె క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటారని గత అనుభవాలే తెలియజేశాయి. ఇప్పుడు కూడా అలానే కనిపిస్తున్నారు.