Pulivendula ZPTC By-Election 2025: పులివెందుల( pulivendula ).. ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది వైయస్సార్ కుటుంబం. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రత్యర్థులు కాలు పెట్టలేని విధంగా కంచుకోటగా మార్చేశారు ఆ నియోజకవర్గాన్ని. కానీ 2024 ఎన్నికల్లో ప్రమాదం ముంచుకొచ్చింది. పులివెందులలో వైయస్ కుటుంబానికి మెజారిటీ తగ్గింది. రాజకీయ ప్రత్యర్థులు సవాల్ చేసే పరిస్థితికి వచ్చింది. కడప జిల్లాలో కూడా వైయస్ కుటుంబ హవా తగ్గింది. పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను.. ఏడు చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇది ఒక విధంగా షాకింగ్ పరిణామమే. ఉమ్మడి రాష్ట్రం నుంచి 2019 ఎన్నికల వరకు కడప జిల్లాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం పట్టు కొనసాగింది. 2024 లో మాత్రం పూర్తిగా సడలింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటూ వస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పులివెందులలో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో ఇక్కడ పట్టు ఎవరిది అనేది తేలిపోనుంది.
దూకుడుగా టిడిపి..
పులివెందుల జడ్పిటిసి అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే పోటీ చేయాలా? వద్దా? అని తర్జనభర్జన పడిన తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) పోటీ చేసేందుకు మొగ్గుచూపింది. ఆ పార్టీ అభ్యర్థిగా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి సతీమణి లతా రెడ్డి ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇరు పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వ్యూహ ప్రతి వ్యూహాలు రూపొందిస్తున్నాయి. అధికార టిడిపి కూటమిలో మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.
పోరు ప్రతిష్టాత్మకం..
ఇక్కడ ఉప ఎన్నిక.. ఎంపీ అవినాష్( MP Avinash Reddy) వర్సెస్ బీటెక్ రవి అన్నట్టు మారింది. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే బీటెక్ రవి దూకుడుగా ఉండేవారు. ఒక ముఖ్యమంత్రిని ఢీకొట్టేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్ద ఎత్తున నియోజకవర్గంలో కార్యాలయాలు తెరిచారు. టిడిపి శ్రేణులకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం పులివెందులకు జగన్ ఎమ్మెల్యే అయినా.. బాధ్యతలు మొత్తం చూసేది అవినాష్ రెడ్డి. జగన్ సీఎం గా ఉన్నప్పుడు సైతం ఆయనే బాధ్యతలు తీసుకునేవారు. అటువంటి అవినాష్ కు ఇప్పుడు ప్రతిష్టాత్మకమే. జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగే అవకాశం లేదు. ఒకవేళ జగన్ ప్రచారం చేసి పార్టీ అభ్యర్థి ఓడిపోతే.. సంక్లిష్ట పరిస్థితి తప్పదు. అందుకే అవినాష్ రెడ్డితో అన్ని తానై వ్యవహరిస్తారు. తెర వెనుక మంత్రంగానికి పరిమితం అవుతారు. అందుకే ఇప్పుడు పులివెందులలో గెలవాల్సిన అనివార్య పరిస్థితి ఆయనది. అయితే ఇది అవినాష్ రెడ్డి కి చాలా కీలకం.
వైయస్ కుటుంబాన్ని ఓడించిన బీటెక్ రవి..
మరోవైపు బీటెక్ రవికి( BTech Ravi ) వైయస్సార్ కుటుంబానికి ఓడించిన చరిత్ర ఉంది. గతంలో రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డిని ఓడించారు బీటెక్ రవి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన వివేకానంద రెడ్డిని ఓడించారు బీటెక్ రవి. కడప జిల్లాలో స్థానిక సంస్థలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఆ సమయంలో సైతం వివేకానంద రెడ్డిని ఓడించగలిగారు బీటెక్ రవి. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను నమ్ముకున్నారు. ఎలాగైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని నమ్మకంగా ఉన్నారు. ఈ నెల 12న ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలను ప్రకటించనున్నారు. చూడాలి ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తుందో?..