Pulivendula By-Election: రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది పులివెందుల( pulivendula). అక్కడ జడ్పిటిసి స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పిటిసి అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో టీడీపీ సైతం అక్కడ అభ్యర్థిని పెట్టింది. నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలో దించింది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చనిపోయిన జడ్పిటిసి కుమారుడిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. దీంతో ఇక్కడ పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. వాస్తవానికి ఈ సీటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుపొందవచ్చు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ గెలుపు అంత ఈజీ కాదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ టిడిపి తో పాటు కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీంతో ఫలితం నువ్వా నేనా అన్నట్టు ఉండడం ఖాయం.
Also Read: ఉచిత ప్రయాణ పథకం.. ఆర్టీసీ బస్సుల్లో తగ్గనున్న సీట్లు !
మారిన సీన్..
సాధారణంగా పులివెందుల అంటేనే వైయస్సార్ కుటుంబ అడ్డా. అంతలా ఉంటుంది అక్కడి హవా. కానీ మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఓడిపోవడంతో గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. ఇంకోవైపు కూటమి కలిసికట్టుగా ముందుకు సాగుతోంది. దాదాపు ఓ పదివేల ఓట్లు పోలింగ్ జరిగే ఈ మండలంలో 5 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న వారే విజేత. అందుకే బిజెపి నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. టిడిపి తరఫున జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. జనసేన నాయకత్వం సైతం సంపూర్ణ సహకారం అందిస్తోంది. పులివెందుల మండలంలో ప్రధాన పంచాయతీలపై రాజకీయ పక్షాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అవినాష్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
అధినేత ఆదేశాలు..
తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో సమన్వయం చేసుకొని పులివెందుల ఉప ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పైగా ఇక్కడ బీటెక్ రవికి మంచి ట్రాక్ రి కార్డు ఉంది . గతంలో ఇదే బిటెక్ రవి( B.Tech Ravi ) జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి పై ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇప్పుడు కూడా కచ్చితంగా గెలుస్తామని బీటెక్ రవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారం చేతిలో ఉండడం.. సర్వశక్తులు ఒడ్డుతుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మరోవైపు కొన్ని గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే తమ పార్టీ నేతలను ప్రలోభ పెట్టి గెలవాలని టిడిపి చూస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే కచ్చితంగా ఫలితం అధికార పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఏపీలో మందుబాబులకు మరింత కిక్..!
జగన్ పరపతికి ప్రమాదం..
అయితే ఇక్కడ తెలుగుదేశం( Telugu Desam) పార్టీ ఓడిపోతే ఆ పార్టీకి ఎటువంటి నష్టం జరగదు. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి పరపతి అమాంతం పడిపోతుంది. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అప్పటినుంచి వై నాట్ కుప్పం అన్న ప్రచారాన్ని పదులు పెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా పులివెందుల విషయంలో ఫలితం తారుమారు అయితే కచ్చితంగా అది కూటమికి ప్రచార అస్త్రంగా మారనుంది. దీనిని స్ఫూర్తిగా చేసుకొని స్థానిక సంస్థలతోపాటు పులివెందులపై కూటమి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.