Public Opinion Survey : సాధారణంగా ఎన్నికల సమయంలో సర్వేలు( survey) ఎక్కువగా హల్చల్ చేస్తుంటాయి. తమ పార్టీ, తమ పరిస్థితి ఎలా ఉంటుందో ఎక్కువమంది నాయకులు సర్వేల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఎన్నికలు జరిగి ఏడాది మాత్రమే అవుతోంది. కానీ ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా సర్వేల మాట వినిపిస్తోంది. నేతలు సర్వేలకు ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. నిజానికి సర్వేలంటే ఎన్నికలకు ముందు.. లేదా ఎన్నికల ఏడాదిలో జరుగుతాయి. అప్పుడు ప్రజల నాడిని తెలుసుకునేందుకు నాయకులు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇప్పుడు ప్రజల మూడ్ ను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా.. ముందస్తు సర్వేలు చేయించుకుంటున్నారు. అయితే ఎవరికి అనుకూలంగా ఉంటే వారితోనే సర్వేలు చేస్తుండడం కూడా విశేషం.
* ముందస్తు సర్వేలతో మేలు ఎంత?
అయితే ఈ ముందస్తు సర్వేలు అనేవి అంత ఆశాజనకంగా ఉండడం లేదు. ఎందుకంటే సర్వేల్లో అనుకూలత కనిపిస్తోంది కానీ.. చివరి నిమిషంలో ట్రెండ్ ( Trend) మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో జరిగింది అదే. సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అమలు చేయడంతో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు వచ్చినా ఏకపక్ష విజయాన్ని అందిస్తూ వచ్చారు. అయితే ఎన్నికల నాటికి ఈ సంక్షేమం అనేది పనిచేయలేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టమైంది. చివరకు బలమైన స్థానాల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఒక విధంగా చెప్పాలంటే ముందస్తు సర్వేలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలువునా మునిగిపోయింది. అయినా సరే తెలుగు నాట ఇప్పుడు సర్వేలకు విపరీతమైన గిరాకీ పెరిగింది.
Also Read : రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ చానెళ్లపై బాలీవుడ్ ప్రముఖుల యుద్ధం.. హైకోర్టుకు..
* ప్రైవేట్ సర్వే ఏజెన్సీలకు ప్రాధాన్యం
ముఖ్యంగా ప్రైవేట్ సర్వే సంస్థలకు( private survey agencies ) అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు. కొందరు ఎమ్మెల్యేలు అయితే ఎంత ఖర్చైనా భరించేందుకు రెడీ అవుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారు? ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? అనే విషయాలపై సర్వే చేయించుకుంటున్నారు. అయితే చాలా సర్వే సంస్థలు ఏపీలో ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందని చెబుతున్నాయి. కానీ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పెద్దల పనితీరు బాగుందని మాత్రం చెప్పుకొస్తున్నాయి. అదే సమయంలో సీఎం చంద్రబాబు సైతం వన్ టైం ఎమ్మెల్యేలు గా ఉండిపోవద్దని హెచ్చరికలు పంపుతున్నారు. ఒకటి మాత్రం నిజం. ఎన్ని సర్వేలు చేసినా ప్రజాభిప్రాయం ఒకటి ఉంటుంది. ఎమ్మెల్యేలు మార్పులు రానంతవరకు.. ఈ సర్వేలు ఎన్ని చేయించుకున్న ప్రయోజనం ఉండదు. ప్రజలకు దగ్గరగా, ప్రజలతో మమేకమయ్యే వారికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది.
* ప్రజలతో మమేకమయ్యే అవకాశం..
వాస్తవానికి ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉంది. ప్రజలతో మమేకమై పనిచేసేందుకు చాలా సమయం కూడా ఉంది. అయితే సోషల్ మీడియాలో( social media) సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. కచ్చితత్వం, నిక్కచ్చిగా, నిర్భయంగా సర్వేలు అంటూ ప్రచారం చేస్తున్నాయి. అవి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. అందుకే చాలా సర్వే సంస్థలతో రాజకీయ పార్టీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అయితే ఈ సర్వేలకు ఎంత పారదర్శకత ఉందంటే మాత్రం సమాధానం దొరకదు. కొన్ని సర్వే సంస్థలు అంచనాలు నిజమవుతున్నాయి. మరికొన్ని ఫెయిల్ అవుతున్నాయి. అయినా సరే ఈ సర్వేలు తెలుగు నాట పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఈ సర్వే ఫలితాలు ఉండడంతో అంతటా అయోమయం నెలకొంది.