Bus Accident: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. వరుసగా ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురవుతున్న సంగతి తెలిసిందే. గుంటూరులో జరిగిన భారీ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. అరకు ఘాట్ రోడ్ లో సైతం ప్రమాదం జరిగి మృత్యువాత పడ్డారు. అయితే ఇలా వరుసగా ఘటనలు జరుగుతున్న వేళ ట్రావెల్ బస్సుల ప్రయాణం అంటేనే భయం వేస్తోంది. తాజాగా మరో ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది. మంటల్లో కాలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు సిబ్బంది సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జిపై బస్సులో నుంచి మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సు పూర్తిగా కాలిపోయింది.
* ఖమ్మం నుంచి విశాఖ వెళుతుండగా..
ఖమ్మం నుంచి విశాఖకు ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెళుతుంది. సరిగ్గా కొవ్వూరు సమీపానికి వచ్చేసరికి.. బస్సులో సెల్ఫ్ మోటర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో అందులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దాదాపు 80 లక్షల రూపాయల విలువచేసే బస్సు పూర్తిగా కాలిపోయింది. సెల్ఫ్ మోటార్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశారు. అయితే ఆ సమయంలో బస్సులో ఆరుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంటలు కారణంగా బస్సు పూర్తిగా కాలిపోయింది.
* తరచూ ప్రమాదాలు..
అయితే ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు( private Travels buses) ప్రమాదాలకు గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత అక్టోబర్ నెలలో కర్నూలు జిల్లా సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఓ బైక్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత వరుసగా బస్సుల్లో మంటలు జలరేగిన ఘటనలు చాలా జరిగాయి. అయితే ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. ఈ బస్సుల ప్రమాదం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించారు. బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోసం తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు. ఫిట్నెస్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడు సంక్రాంతి సమీపిస్తుండడంతో ట్రావెల్స్ బస్సుల తాకిడి పెరిగింది. అదే సమయంలో బస్సుల భద్రత విషయంలో అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.