Prime Minister security: రాజకీయ పార్టీల కార్యకర్తల విషయంలో జనసేనది( janasena ) ప్రత్యేక స్థానం. ఎందుకంటే జనసేన విజయం కోసం దాదాపు పదేళ్లపాటు శ్రమించారు జనసైనికులు. పైగా అక్కడ ఎటువంటి లాభాపేక్ష లేకుండా పార్టీ కోసం పని చేసిన వారు ఎక్కువగా ఉంటారు. పవన్ అంటే ఇష్టపడే వారే జనసేనలో కొనసాగ గలరు. లేకుంటే మాత్రం ఆ పార్టీలో కొనసాగడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఏ ప్రయోజనాలు ఉండవు. అయితే అది పవన్ కళ్యాణ్ కు తెలుసు. తనతో కలిసి నడిచే వారే తన వెంట రావాలని పదేపదే కోరడం వెనుక పవన్ ఆలోచన కూడా అదే. అయితే జనసైనికుల విషయంలో విమర్శించేందుకు ఏమీ ఉండదు కానీ.. పవన్ పట్ల వీరి వీరాభిమానం ఆయనకే ఇబ్బంది తెచ్చిపెడుతోందట. నిన్న రాజోలు సభలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అభిమానుల ను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు.
గొప్ప ఆదరణ..
పవన్ కళ్యాణ్( Pawan Kalyan) సభలు, సమావేశాలకు పెద్దగా జన సమీకరణ అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానించే ప్రతి జన సైనికుడు కొంతమందిని ఆ సభకు తీసుకువెళ్తారు. అదో బాధ్యతగా పరిగణిస్తారు. జనసేనకు వీరాభిమానులు కూడా ఉన్నారు. వారికి వయసుతో పని ఉండదు. అయితే ఈ వీరాభిమానం ప్రధాని భద్రతా సిబ్బందిని సైతం ఆశ్చర్యానికి గురిచేసిందట. ప్రధాని భద్రతా సిబ్బంది పవన్ కళ్యాణ్ కు ఒక మాట విన్నవించారట. కాశ్మీర్లో ప్రధాని పర్యటనను సైతం సజావుగా పూర్తి చేయగలం కానీ.. ఏపీలో మాత్రం మీరు హాజరైన సభల్లో మీ వీరాభిమానులను కట్టడి చేయలేం అంటూ పవన్ కళ్యాణ్ కు చెప్పారట. నిన్న రాజోలు సభలో అదే విషయాన్ని చెప్పారు పవన్ కళ్యాణ్. సాధారణంగా పవన్ మాట్లాడుతున్నంత సేపు ఈలలు, గోల చేస్తుంటారు అభిమానులు. ప్రధాని భద్రత సిబ్బంది అలా అన్నారని చెప్పినా అదే ఈలలు, గోల చేశారు అభిమానులు. దీంతో పవన్ కళ్యాణ్ సైతం వీరికి అర్థం కానట్టు ఉంది అని సైలెంట్ అయ్యారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా..
అయితే జనసైనికులు ఆ వీరాభిమానమే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చేందుకు ఒక కారణమైంది. ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తు కుదర్చడంలో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. దానిని జనసైనికులు గొప్పగా చెప్పుకుంటారు కూడా. ఈ క్రమంలో జనసైనికులు కొంచెం అతిగా వ్యవహరిస్తారు కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎదుర్కోవాలంటే వారు ఉండాల్సిందే. ఆన్లైన్లో అయినా.. ఆఫ్లైన్లో అయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై మాత్రం జన సైనికులు పై చేయిగా ఉంటారు. మాటకు మాట.. దెబ్బకు దెబ్బ అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంటుంది. అధినేత పవన్ మనసు ఎరిగి నడుచుకునేది ఒక్క జన సైనికులు మాత్రమే