Pothula Sunitha: తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) గుర్తింపు సాధించారు పోతుల సునీత. పరిటాల సునీత అనుచరురాలుగా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆమె సేవలను గుర్తించిన తెలుగుదేశం నాయకత్వం ఎమ్మెల్సీ ని చేసింది. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు పోతుల సునీత. రాజకీయ పదోన్నతి ఇచ్చిన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఐదేళ్ల కాలం అలా కరిగిపోయింది. 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీంతో ఆమె ఒక్కక్షణం ఆలోచించకుండా మళ్లీ తెలుగుదేశం గూటికి చేరాలని భావించారు. అందుకు అడ్డంకి గా ఉన్న ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే ఆమెను పార్టీలోకి తీసుకోకూడదని టిడిపి శ్రేణులు ముక్తకంఠంతో హై కమాండ్ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆమె ఇష్టం లేకుండా బిజెపిలో చేరాల్సి వచ్చింది. అయితే బిజెపిలో ఉండలేను టిడిపిలోకి వస్తాను అంటూ ఆమె రాయబారాలు పంపుతూనే ఉన్నారు. కానీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
ఆ ఎమ్మెల్సీలతో కలిసి..
2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీ ఓడిపోయింది. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రీ పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయ మంగళం వెంకటరమణ, మరి రాజశేఖర్ వంటి వారు రాజీనామా చేశారు. అయితే ఇందులో పోతుల సునీత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. చాలామంది ద్వారా ఆ ప్రయత్నాలు చేసి టిడిపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వైసీపీలో ఉన్న సమయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు సునీత. ఆ మాటలను గుర్తుచేసుకొని ఆమెను టిడిపిలో చేర్చుకుంటే ఒప్పుకునేది లేదని క్యాడర్ హెచ్చరించింది. దీంతో నాయకత్వం సైతం వెనక్కి తగ్గింది. అయితే సునీతకు ఏం చేయాలో పాలు పోక పురందేశ్వరి పిలుపుమేరకు బిజెపిలో చేరారు. ఎవరైనా వైసిపి నేతలు పార్టీ లో చేరే క్రమంలో మిగతా రెండు పార్టీల అభిప్రాయం తీసుకోవాలన్న నిబంధన ఉంది. ఈ లెక్కన పోతుల సునీత బిజెపిలో చేరిక వెనుక టిడిపి అంగీకారం ఉంది.
మంత్రి ద్వారా రాయబారం..
ప్రస్తుతం బిజెపిలో( Bhartiya Janata Party) ఉన్న పోతుల సునీత మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నారు. ఆమె మనసంతా టిడిపి వైపు ఉంది. టిడిపిలో చేరుదామంటే.. వీలు లేకపోయిందని.. తప్పనిసరి పరిస్థితుల్లో బిజెపిలో చేరాల్సి వచ్చిందని ఆమె ఆవేదనతో ఉన్నారట. ఓ మంత్రి ద్వారా చంద్రబాబుకు ఆమె విన్నపం చేశారట. తిరిగి టిడిపిలోకి వచ్చేస్తానని.. గతం మాదిరిగా వ్యవహరించినని ఆవేదనతో చెప్పారట.. కానీ చంద్రబాబు దీనిపై ఒక నిర్ణయానికి రాలేకపోయారట. మొత్తానికి అయితే ఆ మహిళా నేత ఆవేదన అంతా ఇంతా కాదు. అధికారాన్ని వెతుకుతూ వెళ్లడం.. అవకాశం ఇచ్చిన పార్టీలపై విమర్శలు చేయడం.. అధినేతలపై వ్యక్తిగత కామెంట్లకు దిగడం వంటి కారణాలతో ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు. నిజంగా ఇటువంటి దూకుడు నాయకులకు అది గుణపాఠమే.