Pothina Mahesh: కాపులే త్యాగాలు చేయాలా? కమ్మ వారు చేయవద్దా పవన్?

జనసేన ఆవిర్భావం నుంచి పోతిన మహేష్ పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు. గత ఐదు సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు.

Written By: Dharma, Updated On : April 8, 2024 5:43 pm

Pothina Mahesh

Follow us on

Pothina Mahesh: జనసేనలో అసంతృప్త స్వరాలు పైకి లేస్తున్నాయి. ఘాటు పదజాలాలు వినిపిస్తున్నాయి. నేరుగా అధినేతనే టార్గెట్ చేసుకుంటున్నారు. విజయవాడ పశ్చిమ సీటును ఆశించిన పోతిన మహేష్ జనసేనకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియా ముందుకు వచ్చి పవన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ ను నమ్మి దారుణంగా మోసపోయానని.. మీరంతా మోసపోవద్దని జనసైనికులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు పోతిన మహేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు ట్రోల్ చేస్తున్నారు. గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పోతిన మహేష్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. సగటు జన సైనికుడి అభిమతం ఇది అంటూ.. చాలా ఘాటుగా విమర్శించారు. జనసేన ను విభేదించి చాలామంది నాయకులు బయటకు వెళ్లారు. కానీ పోతిన మహేష్ మాదిరిగా ఎవరూ వ్యాఖ్యానాలు చేయలేదు. దీంతో ఇది వైరల్ అంశంగా మారిపోయింది.

జనసేన ఆవిర్భావం నుంచి పోతిన మహేష్ పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు. గత ఐదు సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. జనసేనలో పేరు మోసిన పదిమంది నాయకుల్లో పోతిన మహేష్ ముందు వరుసలో ఉంటారు. పవన్ కళ్యాణ్ సైతం పోతిన మహేష్ కు అత్యంత ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఎన్నికల్లో కూడా పశ్చిమ సీటు నీదేనంటూ స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో పోతిన మహేష్ దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు సాగారు. మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసును తట్టుకొని నిలబడ్డారు. అటువంటిది ఈ సీటును పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. గతంలో పవన్ తల్లిని కించపరిచిన సుజనా చౌదరిని సపోర్ట్ చేయడాన్ని తట్టుకోలేకపోయారు. అందుకే జనసేన ను వీడాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఇన్ని రోజులు పవన్ చర్యలను పోతిన మహేష్ సమర్థిస్తూ వచ్చారు. కానీ పొత్తులో భాగంగా జనసేన తక్కువ సీట్లు తీసుకోవడాన్ని సహించలేకపోయారు. పొత్తులో భాగంగా టిడిపి బిజెపికి సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉందని.. కానీ జనసేన త్యాగం చేయడాన్ని పోతిన మహేష్ తప్పు పడుతున్నారు. అది కూడా ఒక కమ్మ నాయకుడి కోసం కాపు నేత త్యాగం చెయ్యాలా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ తీసుకునే నిర్ణయాలు సరికావని తేల్చి చెబుతున్నారు. గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను సైతం పోతిన మహేష్ గుర్తు చేశారు. 15 నుంచి 20 సీట్లు టిడిపి ఇస్తే తీసుకోవాలా? తమ పార్టీకి టిడిపి కుక్క బిస్కెట్లు వేసినట్లు వేస్తే తీసుకోవాలా అని పవన్ ప్రశ్నించిన తీరును ప్రస్తావించారు. ఇప్పుడు ఏ బిస్కెట్లకు మీరు లొంగిపోయారంటూ పవన్ ను ప్రశ్నించారు. విజయవాడ వంటి రాజధాని ప్రాంతంలో తాము ఇన్నాళ్ళు జనసేన పార్టీని బతికించామని.. దానికి ప్రతిఫలంగా పవన్ తమను చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనకు జండా లేదు.. గాజు గ్లాస్ గుర్తులేదు.. అసలు జన సైనికులకు పట్టించుకునే నాధుడే లేడంటూ మహేష్ తేల్చి చెప్పారు. 40 లక్షల క్రియాశీలక కార్యకర్తలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని కోరారు. మొత్తానికైతే కమ్మ నేత కోసం పవన్ కళ్యాణ్ కాపు నేతలను తప్పించారని పోతిన మహేష్ చేస్తున్న వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు ఈ కామెంట్స్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి.