Poll survey in AP : ఏపీలో మరో సంచలన సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో వైసీపీ తిరుగులేని ఆధిక్యతలో ముందంజలో ఉంది. ఎవరెన్ని కూటములు కట్టినా ప్రజలు మాత్రం జగన్ పక్షమే అని స్పష్టమైంది. ఇటీవల నేషనల్ మీడియా సంస్థ టౌైమ్స్ నౌ భారత్ సర్వేలో వైసీపీది ఏకపక్ష విజయం అని తేల్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా సర్వేలో సైతం అదే తేలింది. జగన్ ను నిలువరించడం కష్టమేనని ఈ సర్వే ఫలితం వెల్లడించింది. పోల్ స్ట్రాటజీ అనే సంస్థ ఏపీ వ్యాప్తంగా సర్వే చేసింది. టీడీపీ, జనసేన కూటమి కట్టినా వైసీపీదే గెలుపు అని స్పష్టంగా చెప్పింది.
కేవలం ఓటు షేరింగ్, నాయకత్వ పటిమపై మాత్రమే ఈ సర్వే సాగింది. వైసీపీ ఏకంగా 49 శాతం ఓటు షేరింగ్ తో ముందంజలో ఉంది. టీడీపీ, జనసేన కూటమికి 41 శాతం ఓటింగ్ శాతం దక్కుతుందని తేల్చేసింది. మరో పది శాతం ఇతరులకు వెళుతందని తేల్చింది. సీఎంగా ఎవరు సమర్థులు అన్న ప్రశ్నకు 56 శాతం మంది జగన్ కు ఓటేయగా , చంద్రబాబుకు 37 శాతం మంది జైకొట్టారు. పవన్‌ను కేవలం 7 శాతం మంది మాత్రమే ఎంచుకున్నారు. జగన్ సర్కారు పాలన బాగుందని 56 శాతం మంది చెప్పగా… 22 శాతం మంది బాలేదన్నారు. 9 శాతం మంది చాలా బాగుందని చెప్పగా.. 8 శాతం మంది అసలు బాలేదన్నారు. మూడు శాతం మంది మాత్రం ఎటూ చెప్పలేక న్యూట్రల్ గా ఉండిపోయారు.
2019 ఎన్నికలతో పోల్చుకుంటే వైసీపీకి ఓటు షేరింగ్ కూడా పెరుగుతందని సర్వే తేల్చేసింది. కేవలం సంక్షేమ పథకాల అమలుతోనే జగన్ వైపు ప్రజలు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అభివృద్ధి లేదన్న అపవాదు కంటే ప్రజలు సంక్షేమానికి ఓటు వేశారు. చంద్రబాబు సైతం మినీ మేనిఫెస్టోతో పథకాలను ప్రకటించినా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదని తేలింది. సంక్షేమం అమలు విషయంలో చంద్రబాబు గతంలో పేలవ ప్రదర్శన కూడా జగన్ కు కలిసి వచ్చింది. గతంలో చంద్రబాబు డ్వాక్రా, రైతు రుణమాఫీ హామీ ఇచ్చి అమలుచేయలేకపోయారు. ఇదికూడా ప్రతికూలాంశంగా మారింది. జగన్ మాత్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నాపథకాలు అమలుచేసి చూపడం కూడా ప్రజలను ఆకర్షించింది.
టీడీపీ, జనసేన పొత్తు కూడా పెద్దగా వర్కవుట్ కాదని సర్వే తేల్చింది. పొత్తులు ప్రకటనలకే పరిమయితమవుతున్నాయి. దానికి ఒక భావసారుప్యత రావడం లేదు. అటు పవన్ దూకుడు ఎటువంటి ఫలితాన్నిస్తుందోనన్న భయం చంద్రబాబును వెంటాడుతోంది. పొత్తుతో వెళితే సీట్లు తగ్గిపోతాయి.. లేకుంటే ఓటమి తప్పదన్న ఆందోళనలో బాబు ఉన్నారు. అటు బీజేపీతో వెళితే ఏపీ ప్రజల ఆగ్రహం కూటమిపై పడే చాన్స్ కనిపిస్తోంది. ఇన్ని ప్రతికూలతల మధ్య చంద్రబాబు ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో పోల్ స్ట్రాటజీ సంస్థ సర్వే వెల్లడించిన అంశాలతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన ప్రారంభమైంది. నేతలు మాత్రం అదో ఫేక్ సర్వేగా తేల్చుతున్నారు. వైసీపీ శ్రేణులు మాత్రం సర్వే ఫలితాలతో ఖుషీ అయ్యింది. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించింది.