Rayapati Sambasiva Rao Career: రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన చాలా కుటుంబాలు తర్వాత కనుమరుగయ్యాయి. అటువంటి జాబితాలో చాలా కుటుంబాలు ఉన్నాయి. అయితే గుంటూరు జిల్లాలో తనకంటూ రాజకీయం చేసిన రాయపాటి కుటుంబం ఇప్పుడు.. స్వచ్ఛంద విరమణ చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు దాపురించాయి. చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభలో అడుగుపెట్టారు రాయపాటి సాంబశివరావు. తెలుగుదేశం ప్రభంజనంలో సైతం ఆయన గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టిడిపిలోకి వచ్చారు రాయపాటి. ఒకసారి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో ఆయనకు కానీ.. కుటుంబానికి కానీ ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు చంద్రబాబు. దీంతో ఎన్నికలకు ముందు రాయపాటి కుమారుడు టిడిపి నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అందుకే టిడిపి అధికారంలోకి వచ్చినా ఆ కుటుంబానికి ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. అందుకే ఆ కుటుంబం పూర్తిగా రాజకీయాలనుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* చిన్న వయసులోనే పెద్దల సభకు..
1982లో తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party) ఆవిర్భవించింది. ఆ సమయంలో యువజన కాంగ్రెస్ లో ఉన్నారు రాయపాటి సాంబశివరావు. కమ్మ సామాజిక వర్గం నేత కావడంతో ఆయనను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. తొలిసారిగా రాజ్యసభకు నామినేట్ చేసింది. అప్పుడు ఆయన వయసు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. అటు తరువాత కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు రాయపాటి. 1996, 1998, 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. 2014లో టిడిపి తరఫున పోటీ చేసి మరోసారి పార్లమెంట్ సభ్యులు అయ్యారు. 2019లో టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో తనతో పాటు తన కుమారులను పోటీ చేయించాలని చూశారు. కానీ మారిన సమీకరణ నేపథ్యంలో చంద్రబాబు చాన్స్ ఇవ్వలేదు.
* అవకాశం ఇవ్వని చంద్రబాబు..
2024 ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు( rayapati sambasiva Rao ) నరసారావు పేట పార్లమెంట్ సీటును ఆశించారు. గుంటూరు నుంచి కూడా అవకాశం కోరారు. కుమారుడు రంగారావుకు సత్తెనపల్లి టికెట్ అడిగారు. కానీ సత్తెనపల్లి నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కు ఛాన్స్ దక్కింది. గుంటూరు నుంచి పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం ఇచ్చారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలకు అవకాశం ఇచ్చారు. దీంతో రాయపాటి కుమారుడు రంగారావు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతోంది. కానీ ఇంతవరకు రాయపాటి సాంబశివరావుకు ఎటువంటి పిలుపు లేదు. దీంతో రాజకీయాలనుంచి నిష్క్రమించడమే మేలని ఆ కుటుంబం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి వారి నిర్ణయం ఎలా ఉంటుందో?