Kimidi Nagarjuna Vs Botsa Satyanarayana: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎత్తుకు పైఎత్తులు కొనసాగుతున్నాయి. అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటున్నారు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. అయితే అదే బొత్స విజయనగరం జిల్లాలో అధికార పార్టీ నుంచి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యువ నేతల నుంచి ఆయనకు గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన నేపథ్యంలోనే.. బొత్స తో యువ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు, డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున నేరుగా బొత్స తోనే తలపడుతున్నారు. గత కొద్ది రోజులుగా విజయనగరం జిల్లా లో జరుగుతున్న పరిణామాలతో కిమిడి నాగార్జున సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.
* ఉత్తరాంధ్రలో అతిపెద్ద పండుగ..
ఉత్తరాంధ్రలో( North Andhra) అతిపెద్ద పండుగగా.. పైడితల్లి అమ్మవారి పండుగలు జరుగుతాయి. విజయనగరం పూసపాటి రాజవంశీయుల ఇలవేల్పుగా పైడితల్లి అమ్మవారు ఉన్నారు. అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు కొనసాగుతూ వచ్చారు. ఆయన స్వతహాగా తెలుగుదేశం పార్టీ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి మొన్న గవర్నర్ అయ్యేవరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండేవారు. అనువంశిక ధర్మకర్త కావడంతో ఆలయ సాంప్రదాయాలు ప్రకారం అమ్మవారి ఉత్సవాల్లో ఆయన పాత్ర కీలకంగా మారింది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తన కోట వేదికగా అమ్మవారి సినిమాను తిలకించడం సంప్రదాయంగా వస్తోంది. అదే మాదిరిగా గత మూడు దశాబ్దాలుగా విజయనగరం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ముద్ర చాటుకుంటూ వచ్చారు బొత్స సత్యనారాయణ. తొలుత డిసిసిబి చైర్మన్ గా ఉండడంతో దానిపై అపారమైన పట్టు సాధించారు. అదే పట్టును కొనసాగిస్తూ వచ్చారు. ఏటా డిసిసిబి ప్రధాన కార్యాలయం నుంచి అమ్మవారి సిరిమాను తిలకించేవారు. మూడు దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ కొనసాగిస్తూ వస్తోంది. దానికి చెక్ చెప్పారు కిమిడి నాగార్జున.
* ఓడిపోయినా..
2014 ఎన్నికల్లో చీపురుపల్లి( cheepurupalli ) నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు కిమిడి మృణాళిని. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స సత్యనారాయణ పై గెలిచారు. మంత్రి అయ్యారు. ఆ సమయంలోనే తల్లి చెంతనే రాజకీయాలు చేశారు కిమిడి నాగార్జున. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా యువనేత నాగార్జున రంగంలోకి దిగగా.. వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బొత్స పోటీ చేశారు. బొత్స గెలిచి మంత్రి అయ్యారు. అయితే బొత్స దూకుడుకు కళ్లెం వేసే ప్రయత్నం చేశారు నాగార్జున. ఐదేళ్ల కాలం పాటు గట్టిగానే పోరాటం చేశారు. అయితే 2024 ఎన్నికల్లో అనూహ్యంగా చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు పోటీ చేశారు. సొంత పెదనాన్న కావడంతో ఆయన గెలుపు కోసం కృషి చేశారు నాగార్జున. ఆయన కృషిని గుర్తించిన టిడిపి ప్రభుత్వం డిసిసిబి చైర్మన్ గా నామినేట్ చేసింది. అది మొదలు బొత్సను టార్గెట్ చేసుకున్నారు నాగార్జున.
* అనుమతి నిరాకరణ..
గత 30 సంవత్సరాలుగా డిసిసిబిని ( district Central Bank)వేదికగా చేసుకుని బొత్స అమ్మవారి సిరి మానోత్సవాన్ని తిలకించేవారు. ఈ ఏడాది కూడా అలానే ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నేతల పెత్తనం ఏంటని కిమిడి నాగార్జున దీనికి నో చెప్పారు. అది మొదలు వివాదం ప్రారంభం అయింది. అయితే అమ్మవారి సినిమాను తిలకించే క్రమంలో బొత్స పాల్గొన్న వేదిక కుప్పకూలిపోయింది. ఒకరిద్దరికీ గాయాలు కూడా అయ్యాయి. విజయనగరం జిల్లాలో తనకు ప్రాణహాని ఉందని బొత్స సంచలన ప్రకటన చేశారు. దీనిపై నాగార్జున గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే నాగార్జున వెనుక బలమైన శక్తి ఉందన్న ప్రచారం నడుస్తోంది. అయితే బొత్స పై తలపడుతున్న యువనేత నాగార్జునకు టిడిపి సీనియర్లు సహకరించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.