YS Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈనెల తొమ్మిదిన నర్సీపట్నం పర్యటనకు సంబంధించి అనుమతులు ఇవ్వలేదు. తమిళనాడులో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రోడ్డు మార్గం గుండా వెళ్లేందుకు అనుమతించలేదు. అయితే హెలికాప్టర్లో వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇచ్చారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని గత కొద్దిరోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తోంది. అందులో భాగంగా నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ సందర్శనకు జగన్ సిద్ధమయ్యారు. కానీ విశాఖపట్నం అనుమతించలేదు.
* తమిళనాడు ఘటన నేపథ్యంలో..
కొద్దిరోజుల కిందట తమిళనాడులో సినీ నటుడు విజయ్( cine actor Vijay) రాజకీయ పర్యటన లో అపశృతులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటువంటి పరిస్థితి ఇక్కడ తలెత్తకుండా విశాఖ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జగన్ పర్యటనకు సంబంధించి విశాఖ వైసిపి నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రోడ్డు మార్గం గుండా అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. దారి పొడవున జన సమీకరణ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అందుకే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హెలికాప్టర్లో నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందని నేతలు ఆరోపిస్తున్నారు.
* జన సమీకరణకు ప్లాన్..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీగా ఏర్పాట్లు చేసేందుకు నిమగ్నం అయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తున్నారు. దీనిని విజయవంతంగా పూర్తి చేయడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు సన్నాహక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి 63 కిలోమీటర్ల మేర జగన్ తో రోడ్ షో చేయించేందుకు నిర్ణయించారు. దారి పొడవునా జన సమీకరణకు కూడా ఏర్పాట్లు చేశారు. దీనిపై పోలీస్ శాఖకు స్పష్టమైన సమాచారం ఉండడంతో అనుమతులు నిరాకరించింది. దీనిపై మల్లగుల్లాలు పడుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
* మాజీ మంత్రుల మండిపాటు..
అయితే ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటుందని వైసీపీ మాజీ మంత్రులు ఆరోపిస్తున్నారు. జగన్ హెలికాప్టర్లో వెళ్లాలని చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ రోడ్ షో ఉంటుందని తేల్చి చెప్పారు. జెడ్ ప్లస్ కేటగిరీకి చెందిన ఓ నేతకు భద్రత కల్పించలేని స్థితిలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభం అయ్యిందని.. అందుకే జగన్ బయటకు వస్తుంటే అధికార కూటమిలో భయం పట్టుకుందని కూడా చెప్పుకొచ్చారు. కచ్చితంగా రోడ్డు షో జరిపి తీరుతామని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.