YSP leaders into anonymity : వైసీపీ నేతలకు బిగ్ షాక్ తగిలింది. తమను అరెస్టు చేయకుండా కొద్ది రోజులపాటు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. అటువంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో వైసిపి నేతల అరెస్టు అనివార్యంగా మారింది. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసులను తెరపైకి తెచ్చింది. గతంలో చంద్రబాబు ఇంటిపై మాజీమంత్రి, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దండయాత్ర చేశారు. వందలాది వాహనాలతో దాడి చేసేందుకు బయలుదేరారు. అప్పటి వైసిపి ప్రభుత్వం పై విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు విమర్శలు చేయడానికి తప్పుపడుతూ జోగి రమేష్ దూకుడుగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనపై టిడిపి నేతలు ఫిర్యాదు చేసినా అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ కేసును తిరగదోడింది. దీనిపై పోలీసు దర్యాప్తు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే జోగి రమేష్ అరెస్టు విషయంలో హైకోర్టు గతంలో కీలక సూచనలు చేసింది. రెండు వారాలపాటు ఎటువంటి అరెస్టులు వద్దని సూచించింది. ఈరోజు ఈ పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.
* జోగి రమేష్ చుట్టూ ఉచ్చు
మరోవైపు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసు కూడా ఈరోజు విచారణకు వచ్చింది. వైసిపి ప్రభుత్వ హయాంలో టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి జరిగింది. టిడిపి నేతలతో పాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఫర్నిచర్ తో పాటు ఇతరత్రా వస్తువులను ధ్వంసం చేశాయి. కానీ నాడు వైసిపి నేతల కంటే టిడిపి శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పాత కేసును తెరపైకి వచ్చింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి సీసీ పూటేజీల ఆధారంగా 70 మంది దాడిలో పాల్గొన్నట్లు గుర్తించింది. అందులో కొందరిని అరెస్టు కూడా చేశారు.
* ఆ నలుగురిపై అభియోగాలు
టిడిపి కార్యాలయం పై దాడికి సంబంధించి వైసీపీ కీలక నేతలపై అభియోగాలు ఉన్నాయి. మాజీ ఎంపీ నందిగం సురేష్,ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్ పాత్ర ఉందని తాజాగా తేలింది. వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్టుకు ప్రయత్నించారు. అయితే ఇంతలో వారు హైకోర్టును ఆశ్రయించారు. వీరి విషయంలో కూడా రెండు వారాలపాటు ఎటువంటి అరెస్టులు వద్దని హైకోర్టు సూచించింది. ఈరోజు ఉదయం మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్ ను రద్దు చేసింది. అయితే ఇప్పటికిప్పుడు చర్యలు లేకుండా చూడాలని.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ వారి తరుపు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సాయంత్రం విచారణ చేపట్టి దీనిపై ఆదేశాలు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు తాజాగా చేపట్టిన విచారణలో అభ్యర్థనను తిరస్కరించింది.
* అప్పుడే పరార్
అయితే కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన మరుక్షణం పోలీసులు రంగంలోకి దిగారు. వైసీపీ నేతలను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులు వస్తారనే సమాచారంతో వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇంటికి వెళ్ళగా ఆయన పారిపోయినట్లు సమాచారం. వైసీపీ నేతలు ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్లారు? అన్నది ఆరా తీసే పనిలో పడ్డారు పోలీసులు. రేపటిలోగా వైసీపీ కీలక నేతల అరెస్టులు ఉంటాయని సమాచారం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Police are looking for ycp leaders with the high court verdict
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com