PM Modi AP visit: ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) ఏపీ పర్యటనకు రానున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు అయింది. అక్టోబర్ 16న కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటించనున్నారు. శ్రీశైలం ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. పురావస్తు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అదే రోజు కూటమినేతలతో కలిసి ప్రధాని రోడ్ షోలో పాల్గొంటారు. దీంతో ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. పక్కాగా ప్లాన్ చేస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అనేక కొత్త అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. ఇప్పటికే పూర్తయిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు.
సుదీర్ఘ చరిత్ర..
శ్రీశైలం ( Srisailam)పుణ్యక్షేత్రానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ చరిత్రను వివరించేందుకు పురావస్తు శాఖ ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తోంది. శ్రీశైలం చారిత్రక ప్రాధాన్యాన్ని ఆయనకు వివరించేందుకు పురావస్తు శాఖ అధికారులు ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కార్యాలయ ఆదేశాల మేరకు తామ్ర శాసనాలతో ఈ ప్రదర్శనను సిద్ధం చేస్తున్నారు. 2021లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీశైలం వచ్చినప్పుడు కూడా ఇలాంటి ప్రదర్శనను ఏర్పాటు చేశారు. శ్రీశైలం ఆలయంలో క్రీస్తు శకం 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు లభించిన అనేక తామ్ర శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలు ఆలయ చరిత్రను వివరిస్తాయి. వాటి గురించి ప్రధాని నరేంద్ర మోడీకి వివరించనున్నారు పురావస్తు శాఖ అధికారులు.
అందుబాటులో 20 తామ్ర శాసనాలు
అప్పట్లో శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని రాజులు సందర్శించేవారు. భారీగా విరాళాలు ఇచ్చేవారు. వాటి వివరాలను రాగి రేకులపై రాసేవారు. ఆలయం పై దాడులు జరిగినప్పుడు, మళ్లీ ఆలయ పునరుద్ధరణ జరిగిన సందర్భాలను కూడా ఈ శాసనాల్లో పొందుపరిచారు. తోకచుక్కలు భూమిపై పడిన సంఘటనలను సైతం ఈ తామ్ర శాసనాల్లో ప్రస్తావించారు. మొత్తం 20 తామ్ర శాసనాల గుత్తులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వాటిలో 79 రాగిరేకులు కూడా ఉన్నాయి. ఈ శాసనాలు తెలుగు, సాంస్కృతం, దేవనగరి, హిందీ, ఉర్దూ భాషల్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ శాసనాల వివరాలతో భారత పురావస్తు సంచాలకులు మునిరత్నం రెడ్డి ఒక పుస్తకం కూడా రాశారు. కాగా ప్రధాని పర్యటనలో భాగంగా రోడ్ షో ఉంటుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని ఈ రోడ్ షోలో పాల్గొంటారు.