Nara Lokesh: దయచేసి ఆ సలహాలు ఇవ్వకండి.. ఎల్లో మీడియాకు లోకేష్ కళ్లెం

ఏపీలో తెలుగుదేశం పార్టీ కోసం అహోరాత్రులు శ్రమించే మీడియా ఉంది. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంత దాకైనా వెళ్లేందుకు ఆ మీడియా సిద్ధం. అదే సమయంలో పవర్ లోకి వస్తే.. నిలిపేందుకు తన శక్తి యుక్తులను ప్రదర్శిస్తుంది. అయితే ఇటీవల ఆ సెక్షన్ ఆఫ్ మీడియా జోక్యం పెరిగింది. దీంతో లోకేష్ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : October 14, 2024 2:57 pm

Nara Lokesh

Follow us on

Nara Lokesh: తెలుగుదేశం పార్టీకి గెలుపోటములు అనేది సహజం. అపజయం ఎదురైన ప్రతిసారి ఆ పార్టీకి విజయం తలుపు తట్టింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే జరుగుతోంది. కానీ 2004లో అధికారాన్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ.. 2009లో మాత్రం ఆ ఆనవాయితీని కొనసాగించలేకపోయింది. రాష్ట్ర విభజనతో, ప్రత్యేక పరిస్థితుల్లో మళ్లీ 2014లోనే అధికారాన్ని అందుకోగలిగింది. అయితే తెలుగుదేశం పార్టీ తెలుగు రాజకీయాల్లో ఉండడానికి ప్రధాన కారణం ఆ పార్టీకి ఉన్న మీడియా మద్దతు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. ఆ పార్టీకి ఓటమి ఎదురైనప్పుడు ప్రత్యేక బాధ్యతలు తీసుకొని మరి.. అధికారంలోకి తెచ్చేందుకు ఆ శిక్షణ మీడియా చేసే ప్రయత్నం అంతా కాదు. అలాగని టిడిపి గెలిచిన ప్రతిసారి ఆ సెక్షన్ ఆఫ్ మీడియాకు ప్రత్యేక ప్రయోజనాలు సైతం కొనసాగేవి. అయితే పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఒక సామాజిక వర్గం వరకు ఓకే. అయితే మిగతా సామాజిక వర్గాల నేతలు మాత్రం ఆ సెక్షన్ ఆఫ్ మీడియా చర్యలను వ్యతిరేకించేవారు. అయితే పార్టీకి ఆ మీడియా అవసరం కాబట్టి వారి ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు భాగస్వామ్య పార్టీగా జనసేన తెరపైకి వచ్చింది. మరో జాతీయ పార్టీ బిజెపి సైతం భాగస్వామ్య పార్టీగా మారింది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రభావం క్రమేపి తగ్గుముఖం పడుతూ వస్తోంది. అదే క్రమంలో ఆ మీడియా సైతం పునరాలోచనలో పడింది. తాము ఇన్నేళ్లపాటు టిడిపి కోసం కష్టపడితే.. తమను పట్టించుకోవడం లేదన్న బాధ సెక్షన్ ఆఫ్ మీడియాలో కనిపిస్తోంది.

* వారు చెప్పిందే వేదం
ఫలానా వ్యక్తికి పలానా పదవి ఇవ్వండి. వారిని మంత్రివర్గంలోకి తీసుకోండి. అంటూ తెగ సూచనలు ఇచ్చేవారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అధినేతలు. ఎన్నికల్లో వారు సూచించిన చాలా మంది వ్యక్తులకు టికెట్లు లభించావని బయట ప్రచారం నడుస్తోంది. తమ మీడియా ఎదుగుదలకు సదరు వ్యక్తులు ఎంతగానో సహకరించారు. ఆ వ్యక్తులు రాజకీయంగా రాణించేందుకు సదరు మీడియా అధినేతలు చంద్రబాబుకు సిఫార్సు చేశారు. అంతవరకు ఓకే కాని ఏపీలో కూటమి పార్టీలకు ఏకంగా 164 అసెంబ్లీ సీట్లు లభించాయి. దీంతో మూడు పార్టీల మధ్య సమన్వయం ఒక సమస్యగా మారింది. అందుకే మునుపటిలా ఆ మీడియా అధినేతల మాట చెల్లుబాటు కావడం లేదని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గాలని మీడియా అధినేతలకు చంద్రబాబుతో పాటు లోకేష్ విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం సాగుతోంది.

* వద్దని తేల్చి చెప్పిన యువనేత
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో లోకేష్ పాత్ర పెరిగింది. అదే సమయంలో టిడిపికి అనుకూల మీడియా సైతం సలహాలు ఇవ్వడం ప్రారంభించింది. నామినేటెడ్ పదవుల విషయంలో ఆ సెక్షన్ మీడియా కీలక ప్రతిపాదనలు లోకేష్ ఎదుట పెట్టింది. అయితే లోకేష్ మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆలోచించినంత ఈజీగా ఉండదని.. ఈ విషయంలో సలహాలు తగ్గించుకోవాలని నేరుగా సూచించినట్లు తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించామని.. ఇప్పుడు కూడా పార్టీ అధికారంలోకి రావడానికిశక్తిని వినియోగించామని సదరు మీడియా అధినేతలు చెప్పుకొచ్చారు. అయితే మీకు అన్ని విధాలుగా అండగా నిలబడతామని.. రాజకీయ సలహాలు మాత్రం వద్దని యువనేత వారించినట్లు సమాచారం. మొత్తానికైతే ఎల్లో మీడియా దూకుడుకు యువనేత కళ్లెం వేసారని తెలుస్తోంది. అందులో ఎంత నిజం ఉందో తెలియాలి.