https://oktelugu.com/

PK Survey Leak :  పీకే సర్వే లీక్ : వాళ్లకు గట్టి షాక్

ప్రస్తుతానికి గుంభనంగా ఉండాలని పరిస్థితులకు తగ్గట్టుగా గుట్టు విప్పాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే అంత మొత్తంలో సిట్టింగులను మార్చితే అది ఎటువంటి పరిణామానికి దారితీస్తుందోనని భయపడుతున్నట్టు తెలుస్తోంది. 

Written By: , Updated On : May 29, 2023 / 12:04 PM IST
Follow us on

PK Survey Leak : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉంది వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి. తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని వారు తెగ ఆవేదన చెందుతున్నారు. దాదాపు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కవన్న ప్రచారం ఊపందుకుంది. ఇటీవల ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ టీమ్ చేసిన సర్వే నివేదిక ఇప్పుడు జగన్ టేబుల్ పైకి చేరినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అదే లీకైనట్టు ప్రచారంలో ఉంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 30 నుంచి 40 మంది సిట్టింగులకు టిక్కెట్లు దక్కవని దీని సారాంశం. అయితే ఆ జాబితాలో తమ పేరు ఎక్కడుంటుందోనని చాలా మంది లోలోపల బాధపడుతున్నారు. అటు సోషల్ మీడియాలో ప్రచారం వారిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

రెండు నెలల కిందట వైసీపీ వర్కుషాపులో ఏ ఒక్కర్నీ వదులుకోను అని సీఎం జగన్ సముదాయించారు. తనతో పాటు అందరూ మరోసారి అసెంబ్లీకి రావాలన్నదే తన తపన అని స్వాంతన వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పటి వరకూ నరాలు తెగే ఉత్కంఠలో ఉన్న సిట్టింగ్‌లు అంతా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు తాజాగా మరో జాబితా తయారైందట. ఏపీ మొత్తం తిరిగి తిరిగి సర్వేలు చేసిన ఐ ప్యాక్ టీమ్.. కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగోలేదని, వారికి టికెట్లు ఇస్తే కచ్చితంగా దెబ్బ పడుతుందని చెప్పిందట. ఇప్పుడీ విషయం వైసీపీ వర్గాల్లో, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన దెబ్బతో జగన్ కు తత్వం బోధపడింది. అందుకే జాగ్రత్త పడ్డారు. పర్వాలేదంటూనే కొందరు ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయ నాయకత్వం గుర్తించే పనిలో పడ్డారు.కానీ ఎక్కడా బయటపడడం లేదు. దాదాపు 30 నుంచి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ హ్యాండివ్వబోతున్నారని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇన్నిరోజులు అస్సలు ఆ పరిస్థితే లేదని చెప్పిన జగన్.. ఇంత సడన్‌గా ఇలా ఎందుకు లీక్ చేస్తున్నారు..? వైసీపీలో అసలేం జరుగుతోందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెవులు కొరుక్కుంటున్నారు.

ప్రధానంగా రాయలసీమపై జగన్ ఫోకస్ పెట్టారు. ఎంతో బలంగా ఉన్నామనుకుంటున్న ప్రాంతంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను కోల్పోవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బే. ముందుగా అక్కడ నుంచే మార్పులకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాయలసీమ నుంచి 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. నెల్లూరు నుంచి ముగ్గురు, ఉభయ గోదావరి జిల్లా నుంచి 8 మందిని.. ఉత్తరాంధ్ర నుంచి 9 మందిని పక్కనెట్టాలని ఐ ప్యాక్ టీమ్ క్లియర్‌కట్‌గా జగన్ నివేదిక ఇచ్చిందట. ఇలా మొత్తమ్మీద 30 నుంచి 40 వరకు సిట్టింగ్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ నో చెప్పేయాలని జగన్‌కు ఐ ప్యాక్ తేల్చిచెప్పేసిందట.  ప్రస్తుతానికి గుంభనంగా ఉండాలని పరిస్థితులకు తగ్గట్టుగా గుట్టు విప్పాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే అంత మొత్తంలో సిట్టింగులను మార్చితే అది ఎటువంటి పరిణామానికి దారితీస్తుందోనని భయపడుతున్నట్టు తెలుస్తోంది.