https://oktelugu.com/

Chandrababu : మేనిఫెస్టోపై చంద్రబాబు ఆలోచన అదే

తాము చెప్పింది చేసి చూపిస్తున్నామని..చంద్రబాబు కు విశ్వసనీయత లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సమయంలో తాను చెప్పినది చేస్తానని నమ్మకం కలిగించటం చంద్రబాబు కు అసలైన పరీక్షగా మారుతోంది.  అయితే దీనిని చంద్రబాబు ఎలా అధిగమిస్తారో చూడాలి మరీ.

Written By: , Updated On : May 29, 2023 / 12:24 PM IST
Follow us on

Chandrababu : చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అధికార పక్షానికి సవాల్ చేశారు. తొలివిడత మేనిఫెస్టో ప్రకటించి ప్రజల్లో చర్చకు కారణమయ్యారు. ఈ క్రమంలో విశ్వసనీయత, హామీల అమలు వంటివి తెరపైకి వస్తున్నాయి. వాటి రూపంలో చంద్రబాబుకు సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమిస్తేనే చంద్రబాబు ప్రకటించిన పథకాలు వర్కవుట్ అయ్యేవి. లేకుంటే అది జగన్ కే పొలిటికల్ అడ్వాంటేజ్ గా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వ్యూహం లేకుండా చంద్రబాబు ఏ పనిచేయ్యరు. ప్రధానంగా జగన్ ఓటు బ్యాంకుపై గురిపెట్టారు. తన పాలనా సామర్ధ్యానికి, సంక్షేమ పథకాల ప్రకటన లబ్ధి తోడైతే తనను ఎవరూ ఆపలేరని భావిస్తున్నారు. వైసీపీ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈ వ్యూహాలు పక్కాగా అమలు జరిగితే సత్ఫలితం సాధ్యమని చంద్రబాబు చెబుతున్నారు.

సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేశారు. చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టారు. అదే సమయంలో చంద్రబాబు విశ్వసనీయతపై ఎన్నో ప్రశ్నలను నేవలెత్తారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన 650 హామీల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు  అమలు చేయలేదని ప్రతీ సభలో చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో వివరించారు. తన తండ్రి వారసత్వంగా విశ్వసనీయత తనకు ఉందని చెప్పుకొచ్చారు. దీంతో ప్రజలు కూడా నమ్మారు. అయితే ఇప్పుడు తాను ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అయితే సంక్షేమ పథకాలు ప్రకటించారు.. సరే కానీ వాటిని అమలుచేయడంలో చంద్రబాబు విశ్వసనీయతపైనే అనేక రకాలుగా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

గతంలో మహిళలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా మలుచుకున్నారు. స్వయం సహాయక సంఘాలు, ఉపాధినిచ్చే పథకాలు, రాయితీలు, రుణాలను అమలుచేసి స్థిరమైన ఓటు బ్యాంకుగా తీర్చిదిద్దుకున్నారు. కానీ జగన్ వచ్చాక చంద్రబాబు ఓటు బ్యాంకుపైనే  ఫోకస్ పెట్టారు. సంక్షేమ పథకాల్లో ప్రతీదీ మహిళలకే అందిస్తున్నారు. దీంతో మహిళా ఓట్ బ్యాంక్ మొత్తం జగన్ కు టర్న్ అయ్యింది. ఈ విషయం గ్రహించిన చంద్రబాబు తన మేనిఫెస్టోలో కీలక ప్రకటనలు చేసారు. ప్రతీ మహిళకు నెలకు రూ 1500 వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమం పథకాలు కొనసాగిస్తూ వీటిని అమలు చేస్తారా..లేక వీటిని మాత్రమే అమలు చేస్తారా అనేది క్లారిటీ ఇవ్వలేదు. జగన్ సంక్షేమాన్ని ఢీకొట్టాలంటే ఈ పథకాలు చాలవని.. మరన్ని ప్రజాకర్షక పథకాలు రావాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాను ప్రకటించిన పథకాలను  ప్రజల్లో నమ్మకం కలిగించటం చంద్రబాబుకు అసలైన సవాల్ గా మారనుంది. సీఎం  జగన్ విమర్శలు ఎలా ఉన్నా సంక్షేమం పేరుతో ప్రతీ నెలా ఏదో పథకం కిందం నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు కాలేదనే ప్రచారం ప్రజల్లో బలంగా ఉంది. ఇప్పుడు అధికారం కోసం మరోసారి మేనిఫెస్టోలో చంద్రబాబు హామీలను ఇస్తున్నారని వైసీపీ ప్రచారం ప్రారంభించింది. తాము చెప్పింది చేసి చూపిస్తున్నామని..చంద్రబాబు కు విశ్వసనీయత లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సమయంలో తాను చెప్పినది చేస్తానని నమ్మకం కలిగించటం చంద్రబాబు కు అసలైన పరీక్షగా మారుతోంది.  అయితే దీనిని చంద్రబాబు ఎలా అధిగమిస్తారో చూడాలి మరీ.