Pithapuram Varma: ఏపీలో( Andhra Pradesh) రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేయడం ద్వారా ప్రజాభిమానం పొందాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిపించిన నేత.. పవన్ కళ్యాణ్ ఓడిస్తానని శపధం చేసిన నాయకుడు ఒక్కే వేదిక పైకి వచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు వైసీపీలో చేరుతారని చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. ఇటువంటి తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఆ టిడిపి మాజీ ఎమ్మెల్యే కలవడం ఇప్పుడు సరికొత్త ప్రచార అస్త్రంగా మారింది. ఇంతకీ ముద్రగడను కలిసింది ఎవరో తెలుసా? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. అప్పటినుంచి ప్రచారం మరింత ఎక్కువగా మారింది.
* 15 నెలలు అవుతున్నా దక్కని పదవి
మొన్నటి ఎన్నికల్లో పిఠాపురం( Pithapuram ) నుంచి పోటీ చేశారు పవన్ కళ్యాణ్. అత్యధిక మెజారిటీతో గెలిచి మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎం హోదాతో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు టిడిపి ఇన్చార్జ్ వర్మ. అలా చేసినందుకు గాను వర్మ కు తగిన ప్రాధాన్యం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సైతం వర్మ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులను భర్తీ చేశారు. ఇలా భర్తీ సమయంలో వర్మ పేరు బయటకు రావడం.. తరువాత దాటవేయడం పరిపాటిగా మారింది. దీంతో వర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఒకానొక దశలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ పరిస్థితుల్లో ఆయన మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే ఆయన ముద్రగడను కలిసినట్లు టాక్ నడుస్తోంది.
* పవన్ పై ఆగ్రహం..
ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham ) సైతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు అనేక రకాల పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముద్రగడ జనసేనలో చేరుతారని ప్రచారం సాగింది. పవన్ సైతం ముద్రగడను ఆహ్వానించి తరువాత పట్టించుకోవడం మానేశారు. దీనిని తీవ్ర అవమానంగా భావించిన ముద్రగడ తన కుమారుడితో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడిస్తానని.. అలా ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని శపధం చేశారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు ముద్రగడ. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తూ ఆయన విజయానికి కృషి చేశారు వర్మ. అయితే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి తర్వాత ముద్రగడ పై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తానని కూడా శపధం చేశారు ముద్రగడ. ఇటువంటి పరిస్థితుల్లో పిఠాపురం వర్మ ముద్రగడ ఇంటికి వెళ్లి చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* అనారోగ్యం బారిన ముద్రగడ
అయితే ఇటీవల ముద్రగడ పద్మనాభం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనకు హైదరాబాదులో అత్యవసర వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ముద్రగడ కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పిఠాపురం వర్మ ఆయనను కలిసినట్లు సమాచారం. అయితే వర్మ అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముద్రగడను కలవడంతో పార్టీ మారేందుకే నన్న టాక్ ప్రారంభం అయ్యింది. వాస్తవానికి ఇటీవల పిఠాపురం వర్మకు ఇద్దరు గన్మెన్లను కేటాయించారు. చంద్రబాబు పిలిచి మాట్లాడడంతో వర్మకు పదవి ఖాయమని నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ముద్రగడను పరామర్శించడం ద్వారా వర్మ వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. మరి అందులో ఎంత నిజం ఉందో చూడాలి.