Cooperative banks UPI access: దేశంలో ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల( digital transactions ) శకం నడుస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా క్యూ ఆర్ కోడ్ స్కాంతో చెల్లింపులు, ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలను ప్రజలు వినియోగిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇప్పటికీ కొన్ని బ్యాంకుల్లో ఈ సేవలు అందుబాటులోకి రాలేదు. అందులో ఏపీలో కొన్ని సహకార బ్యాంకులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ బ్యాంకుల్లో వినియోగదారుల సౌకర్యార్థం యుపిఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో కూడా యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మకంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సహకార బ్యాంకుల్లో రిపబ్లిక్ డే నాడు ఈ సేవలను ప్రారంభించింది. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కూడా సేవలను విస్తరించాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం.
రైతులకు ప్రయోజనం..
సాధారణంగా సహకార బ్యాంకుల్లో( cooperative banks ) రైతులు ఎక్కువగా వినియోగదారులుగా ఉండేవారు. అయితే ఇప్పుడు ఆ బ్యాంకులు వాణిజ్యపరంగా కూడా మారాయి. అందుకే అక్కడ లావాదేవీలు మరింత పెంచేందుకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగానే యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక రైతులు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలను ఉపయోగించవచ్చు. అయితే ఇప్పటివరకు వాణిజ్య బ్యాంకుల్లో మాత్రమే ఈ సేవలు ఉండేవి. దీనివల్ల సహకార బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న రైతులు పంటల క్రయవిక్రయాలకు సంబంధించి వాణిజ్య బ్యాంకుల వైపు చూడాల్సి వచ్చేది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సహకార బ్యాంకుల్లో సైతం యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
కంప్యూటరీకరణ పూర్తి..
ఇటీవల సహకార బ్యాంకుల్లో కంప్యూటరీకరణ ( computerisation) పూర్తి అయ్యింది. దాదాపు అన్ని రకాల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. ఆన్లైన్ సేవలను ప్రారంభించేందుకు లైన్ క్లియర్ అయింది. వాస్తవానికి సహకార బ్యాంకుల్లో రైతుల కోసమే సేవలు అందేవి. కానీ ఇతర వాణిజ్య బ్యాంకులు సైతం ఈ సేవలను ప్రారంభించాయి. అందుకే సహకార బ్యాంకుల్లో సైతం వాణిజ్య సేవలు అందేలా మార్పులు జరిగాయి. అది కూడా ఒకటి డిజిటలైజేషన్కు కారణం. యూపీఐ సేవలో అందుబాటులోకి రావడంతో సహకార బ్యాంకు ఖాతాదారులు తమ ఫోన్ లను ఉపయోగించి ఎప్పుడైనా.. ఎక్కడి నుంచైనా బ్రాంచ్ని సందర్శించకుండానే నగదు రహిత లావాదేవీలు చేయవచ్చు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా సహకార బ్యాంకుల్లో కూడా ఈ సేవలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ రంగంలో ఆర్థిక లావాదేవీలను ఇది మరింత సులభతరం చేస్తుంది.